Chandrababu Naidu: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: సీఎం చంద్రబాబు

Andhra Pradesh CM Chandrababu Reviews Heavy Rain Situation
  • భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
  • కృష్ణా నదికి 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని అంచనా
  • లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం
  • వరద నీటితో సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నింపాలని కీలక సూచన
  • చెరువుల గట్లను పటిష్టం చేయాలని, తూడు తొలగించాలని ఆదేశం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, సీఎస్ విజయానంద్ తదితరులు హాజరయ్యారు. విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జలవనరుల శాఖ  ఉన్నతాధికారులు కూడా ఈ అత్యవసర సమీక్షలో పాల్గొన్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తత చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో వాగులు వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 

కృష్ణా నదిలో రేపటికల్లా 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి 35 గేట్లు ఎత్తి 3.09 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. కాలువలకు 5 వేల క్యూసెక్కుల మేర నీరు విడిచిపెట్టినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు ఎగువన నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను కూడా ఎత్తినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తక్షణం తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

వరద నీటిని సద్వినియోగం చేయండి

ఎగువ నుంచి వస్తున్న నీటిని  సద్వినియోగం చేసుకునేలా రోజుకు నాలుగు టీఎంసీల చొప్పున తరలించి సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నింపాలని సీఎం ఆదేశించారు. వరద నీటిని వృధాగా సముద్రంలోకి పోనీయకుండా సద్వినియోగం చేసుకునేలా సమర్ధ నీటి నిర్వహణ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మైలవరం సహా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం బుడమేరు, వెలగలేరులకు పెద్ద ఎత్తున వస్తోందని.. ఈ నీరు కృష్ణా నదిలోకి డిశ్చార్జి చేస్తున్నట్టు తెలిపారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు వివరించారు. వరద నిర్వహణా పనుల్లో భాగంగా రూ.40 కోట్లతో బుడమేరు- వెలగలేరు యూటీ నిర్మాణాన్ని చేపట్టేందుకు ముఖ్యమంత్రి అనుమతి మంజూరు చేశారు.

గండ్లు పడకుండా గట్లు పటిష్ట పర్చాలి

మరోవైపు భారీవర్షం కారణంగా కొండవీటి వాగు, పాల వాగులకు వస్తున్న నీటిని కృష్ణా నదిలోకి నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వర్షకాల సీజన్ లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలువల్లో నీటి ప్రవాహాలు సక్రమంగా వెళ్లేందుకు వీలుగా గుర్రపు డెక్క, తూడును తొలగించాలని ముఖ్యమంత్రి జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా గట్లను పటిష్టం చేయాలని సీఎం సూచించారు. జిల్లాల్లో వర్షాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండి రైతులకు తక్షణ సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

భారీ వర్షాల నేపథ్యంలో భూగర్భ జలాలను రీఛార్జి చేసేలా నిర్మాణాలను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులు ఆయా ట్రెంచ్ లను ఎక్కడెక్కడ చేపట్టాలో ప్రణాళిక చేసుకోవాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ట్రెంచ్ లను తవ్వేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
Chandrababu Naidu
Andhra Pradesh rains
heavy rainfall
Krishna River
flood alert
Prakasam Barrage
water resources
irrigation projects
Somashila project
Kandaleru project

More Telugu News