: అమెరికాలోని ప్రముఖ హిందూ దేవాలయంపై ఖలిస్థానీ దాడి

  • కాలిఫోర్నియాలోని స్వామి నారాయణ్ ఆలయంపై దాడి
  • ఆలయం గోడలపై భారత వ్యతిరేక నినాదాలు
  • ఘటనను తీవ్రంగా ఖండించిన భారత కాన్సులేట్
అమెరికాలో మరోసారి ఖలిస్థానీ మద్దతుదారులు రెచ్చిపోయారు. కాలిఫోర్నియాలోని నెవార్క్ నగరంలో ఉన్న ప్రముఖ శ్రీ స్వామినారాయణ్ హిందూ ఆలయంపై విద్వేషపూరిత దాడికి పాల్పడ్డారు. ఆలయం వెలుపలి గోడలపై భారత వ్యతిరేక నినాదాలు, ఖలిస్థానీ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రాన్‌వాలేను పొగుడుతూ స్ప్రే పెయింట్‌తో రాతలు రాశారు. ఈ ఘటన స్థానిక హిందూ సమాజంలో తీవ్ర ఆందోళన కలిగించింది.

ఈ దుశ్చర్యను గుర్తించిన ఆలయ నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై స్పందించిన నెవార్క్ పోలీస్ విభాగం, దీనిని కేవలం సాధారణ విధ్వంసంలా కాకుండా, ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని చేసిన దాడిగా పరిగణిస్తున్నామని తెలిపింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. 

ఈ దాడిని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించింది. అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొంది. భారతీయ సమాజం మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. అమెరికాలో హిందూ దేవాలయాలపై ఈ ఏడాది దాడి జరగడం ఇది నాలుగోసారి అని నిర్వాహకులు తెలిపారు.

More Telugu News