H-1B Visa: హెచ్-1బీ లాటరీకి గుడ్ బై? జీతం ఆధారంగా వీసాల జారీకి అమెరికా సన్నాహాలు!

US to Replace H1B Lottery with Salary Based Visa System
  • హెచ్-1బీ వీసా లాటరీ విధానాన్ని మార్చే ప్రతిపాదనకు వైట్ హౌస్ ఆమోదం
  • ఇకపై లాటరీకి బదులుగా జీతం ఆధారంగా వీసాల ఎంపిక
  • అధిక వేతనాలు పొందే ఉద్యోగాలకే ప్రాధాన్యతనిచ్చే అవకాశం
  • విదేశీ గ్రాడ్యుయేట్లు, ప్రారంభ స్థాయి ఉద్యోగులకు కష్టతరం కానున్న హెచ్-1బీ
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు అత్యంత కీలకమైన హెచ్-1బీ వీసా జారీ ప్రక్రియలో భారీ మార్పులు రానున్నాయి. ఇప్పటివరకు అనుసరిస్తున్న లాటరీ విధానాన్ని రద్దు చేసి, దాని స్థానంలో వేతనాల ఆధారంగా వీసాలను ఎంపిక చేసే కొత్త విధానానికి అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) రూపొందించిన ఈ కీలక ప్రతిపాదనకు వైట్ హౌస్‌లోని కీలక విభాగం ఆమోదముద్ర వేసినట్టు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది.

ప్రస్తుతం ప్రతి ఏటా 85,000 హెచ్-1బీ వీసాలను అమెరికా జారీ చేస్తోంది. దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తుండటంతో, కంప్యూటరైజ్డ్ ర్యాండమ్ లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ విధానం వల్ల ఏ ఒక్క కంపెనీకి పక్షపాతం చూపకుండా నిష్పక్షపాతంగా ఎంపిక జరుగుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ విధానాన్ని మార్చాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త ప్రతిపాదన ప్రకారం, ఇకపై లాటరీ పద్ధతిని పక్కనపెట్టి, ఉద్యోగానికి లభించే వేతనం ఆధారంగా హెచ్-1బీ వీసాలను కేటాయిస్తారు. అంటే, అత్యధిక జీతం ఆఫర్ చేసే ఉద్యోగాలకే వీసాలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో ట్రంప్ హయాంలో ప్రతిపాదించిన నిబంధనలనే మళ్లీ తెరపైకి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 8న ‘ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్’ ఈ ప్రతిపాదనను క్లియర్ చేయడంతో, త్వరలోనే దీనిపై బహిరంగ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, అమెరికాలోని టెక్ కంపెనీలు అధిక నైపుణ్యం, అధిక జీతాలు కలిగిన విదేశీ నిపుణులను మాత్రమే నియమించుకోవాల్సి వస్తుంది. దీనివల్ల అమెరికాలో ప్రారంభ స్థాయి (ఎంట్రీ-లెవల్) ఉద్యోగాలు స్థానిక అమెరికన్లకే దక్కుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఇదే సమయంలో అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువు పూర్తిచేసుకున్న విదేశీ విద్యార్థులకు, తక్కువ జీతంతో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి హెచ్-1బీ వీసా పొందడం దాదాపు అసాధ్యంగా మారనుంది.

ఈ మార్పులు చేయడానికి కాంగ్రెస్ ఆమోదం అవసరం లేదు. వీసాల సంఖ్య (85,000)ను మార్చనంత వరకు, డీహెచ్‌ఎస్, యూఎస్‌సీఐఎస్ వంటి సంస్థలు నేరుగా కొత్త నిబంధనలను నోటిఫై చేసే అధికారం కలిగి ఉంటాయి. వ్యాపార వర్గాలు, వలసదారుల హక్కుల సంఘాలు గతంలోనే ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. ఈ మార్పులు అమలైతే హెచ్-1బీ వీసా ఆశావహులపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం.
H-1B Visa
USCIS
H1B Visa Lottery
USA Jobs
Indian Professionals
Department of Homeland Security
DHS
Immigration
Foreign Workers
Salary Based H1B

More Telugu News