Traffic Police UP: నీకంటే ఎక్కువే చదువుకున్నా... ఓ రాజకీయ నేత కుమారుడికి ట్రాఫిక్ పోలీస్ కౌంటర్

Traffic Police UP Officer Confronts Politician Son
  • యూపీలో బీజేపీ ఎమ్మెల్సీ కుమారుడి అధికార దర్పం
  • రద్దీ రోడ్డుపై కారు ఆపి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
  • ప్రశ్నించిన పోలీసుపై ఎమ్మెల్సీ కుమారుడి దురుసు ప్రవర్తన
  • "మీ నాన్న పరువు తీస్తున్నావు" అంటూ కానిస్టేబుల్ గట్టి జవాబు
  • పోలీస్, నేత కొడుకు మధ్య వాగ్వాదం.. సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసిన కానిస్టేబుల్
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన
ఉత్తరప్రదేశ్‌లో ఓ ట్రాఫిక్ పోలీస్ అధికారి, అధికార పార్టీ నేత కుమారుడికి మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విధి నిర్వహణలో భాగంగా తనను అగౌరవపరిచిన బీజేపీ ఎమ్మెల్సీ కుమారుడికి ఆ కానిస్టేబుల్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గట్టిగా బదులిచ్చారు. "నువ్వు మీ నాన్న పరువు తీస్తున్నావు" అంటూ అతనికి చురకలంటించిన తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. యూపీలోని హత్రాస్‌లో ఉన్న ఓ రద్దీ రహదారిపై బీజేపీ ఎమ్మెల్సీ చౌదరి రిషిపాల్ సింగ్ కుమారుడు తపేశ్ తన స్కార్పియో ఎస్‌యూవీని రోడ్డుకు అడ్డంగా ఆపారు. వాహనం ముందు అద్దంపై "విధాయక్" అని రాసి ఉండగా, బానెట్‌పై బీజేపీ జెండా ఉంది. అతని వెంట ఓ గన్నర్ కూడా ఉన్నారు. కారు కారణంగా ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో, విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎస్.పి. సింగ్ కారు వద్దకు వెళ్లి దాన్ని పక్కకు తీయాలని సూచించారు.

దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్సీ కుమారుడు తపేశ్.. "పో ఇక్కడి నుంచి" (భాగ్ యహా సే) అంటూ కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించారు. ఈ మాటలతో అవాక్కైన కానిస్టేబుల్ వెంటనే తేరుకుని గట్టిగా బదులిచ్చారు. "నాకు 55 ఏళ్లుంటాయి, నన్నే అలా అంటావా? నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా? ట్రాఫిక్ జామ్ చేసి ఇంకా వాదిస్తున్నావు" అని సింగ్ ప్రశ్నించారు. ఈ వాగ్వాదాన్ని ఆయన తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేయడం ప్రారంభించారు.

పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇతర పోలీసులు ప్రయత్నించినా ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. "నువ్వు మీ నాన్న పరువు తీస్తున్నావు" అని కానిస్టేబుల్ అనగా, "మీరే డిపార్ట్‌మెంట్ పరువు తీస్తున్నారు" అని తపేశ్ ప్రతివిమర్శ చేశారు. "నేను నీకంటే ఎక్కువ చదువుకున్నా, ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పెడతా. నువ్వు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నావు" అని కానిస్టేబుల్ స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్సీ కుమారుడు తల ఊపుతూ కారును అక్కడి నుంచి ముందుకు పోనిచ్చారు. 
Traffic Police UP
Tapesh chaudhary
BJP MLC
Hathras traffic police
Uttar Pradesh police
Road rage india
Chaudhari Rishipal Singh
Traffic Constable SP Singh
Political influence india
Viral video india

More Telugu News