ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేలా చూడాలి: భారీ వర్షాలపై రేవంత్ రెడ్డి సమీక్ష

  • మూడు రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని ఆదేశం
  • ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్ లిఫ్టింగ్‌కు హెలికాప్టర్లు సిద్ధంగా ఉండాలని సూచన
  • రెడ్ అలర్డ్ ఉన్న జిల్లాల్లో సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమించాలన్న సీఎం
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రానున్న మూడు రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగుల సెలవులను రద్దు చేయాలని ఆయన ఆదేశించారు.

ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ఎయిర్‌లిఫ్టింగ్‌ కోసం హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంఛార్జ్ మంత్రులు, అధికారులను ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో అధికారులు నిత్యం సమన్వయం చేసుకోవాలని, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు సిబ్బందిని ముందుగానే పంపించాలని సూచించారు. రెడ్ అలర్ట్ జారీ చేయబడిన జిల్లాల్లో సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమించాలని ఆయన అన్నారు.

వర్షాలు, వరదల గురించిన సమాచారాన్ని మీడియా ద్వారా ప్రజలకు చేరవేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వరదలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని అన్నారు. హైదరాబాద్ నగరంలో వరదల పరిస్థితిపై హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యాసంస్థలకు సెలవుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రాణ, ఆస్తి, పశు సంపద నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.


More Telugu News