Yuvraj Singh: సచిన్ చెప్పిన ఆ మాట వల్లే కప్ గెలిచాం.. 2011 వరల్డ్ కప్ రహస్యం చెప్పిన యువరాజ్

Yuvraj Singh Shares Unheard Sachin Tendulkar Gary Kirsten Tale From 2011 World Cup
  • మహిళల ప్రపంచకప్‌కు ముందు భారత జట్టుకు యువరాజ్ సింగ్ సూచనలు
  • టీవీ, పేపర్లు చూడకుండా ఆటపైనే దృష్టి పెట్టాలని సలహా
  • 2011 ప్రపంచ కప్‌లో సచిన్, గ్యారీ కిర్‌స్టెన్ ఇదే చెప్పారని వెల్లడి
  • సెప్టెంబర్ 30న భారత్‌లో ప్రారంభంకానున్న మెగా టోర్నీ
  • భారత్ కు తొలి టైటిల్ అందించడమే లక్ష్యంగా బరిలో దిగుతున్న హర్మన్‌ప్రీత్ సేన
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025కు సమయం దగ్గరపడుతున్న వేళ, భారత మాజీ ఆల్-రౌండర్ యువరాజ్ సింగ్ జట్టులో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలో ఒత్తిడిని ఎలా జయించాలో వివరిస్తూ, 2011లో తాము కప్ గెలవడానికి ఉపయోగపడిన ఒక కీలక రహస్యాన్ని పంచుకున్నాడు. టీవీ చూడటం, వార్తాపత్రికలు చదవడం పూర్తిగా మానేసి, కేవలం ఆటపైనే దృష్టి పెట్టాలని ఆయన అమ్మాయిలకు సూచించాడు.

సోమవారం ముంబైలో ఐసీసీ ఛైర్మన్ జై షా, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి యువరాజ్ సింగ్ మహిళల ప్రపంచ కప్ 2025 ట్రోఫీని ఆవిష్క‌రించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2011 ప్రపంచ కప్‌లో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. "మేము 2011 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ను టై చేసుకున్నాం. దక్షిణాఫ్రికాతో గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయాం. ఆ సమయంలో మాపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. సొంతగడ్డపై కప్ గెలవలేమనే ఒత్తిడి పెరిగింది" అని యువరాజ్ తెలిపాడు.

ఆ క్లిష్ట సమయంలో సచిన్ టెండూల్కర్, కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ తమతో మాట్లాడారని యువరాజ్ వివరించారు. "ఇక్కడి నుంచి టోర్నీ గెలవాలంటే ఏం చేయాలో వారు మాకు స్పష్టంగా చెప్పారు. 'ఎవరూ టీవీ చూడొద్దు, పేపర్లు చదవొద్దు. మైదానంలోకి వెళ్లేటప్పుడు, తిరిగి రూమ్‌కు వచ్చేటప్పుడు హెడ్‌ఫోన్స్ పెట్టుకోండి. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా, పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టండి' అని వారు సలహా ఇచ్చారు. ఆ సూచన మాకు ఎంతో మేలు చేసింది. అనవసరమైన విమర్శలను పక్కనపెట్టి ఆటపై ఏకాగ్రత పెట్టడం వల్లే 28 ఏళ్ల తర్వాత కప్ గెలవగలిగాం" అని యువరాజ్ అన్నాడు.

ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. భారత మహిళల జట్టు, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రపంచ కప్ గెలవలేదు. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ఈసారి సొంతగడ్డపై ఆ లోటును తీర్చి, తొలి టైటిల్‌ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

Yuvraj Singh
2011 World Cup
Sachin Tendulkar
ICC Women's World Cup 2025
India Cricket
Gary Kirsten
Cricket World Cup
Indian Cricket Team
Harmanpreet Kaur
Mithali Raj

More Telugu News