రజినీ ‘కూలీ’ రెమ్యూనరేషన్ల లీక్.. నాగార్జున, ఆమిర్‌ ఖాన్, శ్రుతిహాసన్‌కు ఎంత ముట్టిందంటే..!

  • రజినీకాంత్ ‘కూలీ’ చిత్రానికి భారీ పారితోషికం
  • ఏకంగా రూ. 200 కోట్లు అందుకుంటున్న తలైవా
  • దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌కు రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్
  • నాగార్జునకు రూ. 10కోట్లు, ఆమిర్ ఖాన్ కు రూ. 20కోట్లు
  • ఈ నెల‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం నటీనటులు అందుకుంటున్న పారితోషికాల వివరాలు ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు భారతీయ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. డెక్కన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం, ఈ చిత్రంలో ‘దేవా’ పాత్ర పోషిస్తున్న రజినీకాంత్ ఏకంగా రూ. 200 కోట్ల భారీ పారితోషికం అందుకుంటున్నారని సమాచారం. మొదట రూ. 150 కోట్లకు ఒప్పందం కుదిరినప్పటికీ, సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో ఉండటంతో నిర్మాతలు ఆయన పారితోషికాన్ని పెంచినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో కేవలం నటీనటుల పారితోషికాలే కాకుండా, సాంకేతిక బృందం రెమ్యూనరేషన్లు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు రూ. 50 కోట్లు, ‘జైలర్’ తర్వాత మరోసారి రజినీతో పనిచేస్తున్న సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌కు రూ. 15 కోట్లు చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి.

‘కూలీ’లో భారీ తారాగణం వుంది. టాలీవుడ్‌ స్టార్ నాగార్జున ‘సైమన్’ అనే కీలక పాత్ర కోసం రూ. 10 కోట్లు అందుకుంటున్నారని చెబుతున్నారు. ఇక బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ‘దాహా’ అనే గ్యాంగ్‌స్టర్ అతిథి పాత్రలో మెరవనుండగా, ఆయనకు రూ. 20 కోట్లు ముట్టినట్లు సమాచారం. ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సత్యరాజ్ (రాజశేఖర్), కన్నడ స్టార్ ఉపేంద్ర (కలీష) చెరో రూ. 5 కోట్లు, కథానాయిక శ్రుతిహాసన్ (ప్రీతి) రూ. 4 కోట్లు తీసుకుంటున్నారని ట్రేడ్ వర్గాల స‌మాచారం.

మరోవైపు, అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘కూలీ’ దూసుకుపోతోంది. ట్రేడ్ వెబ్‌సైట్ సాక్‌నిల్క్ ప్రకారం, ఈ చిత్రం ఇప్పటికే ప్రీ-సేల్స్‌లో రూ. 14 కోట్లు వసూలు చేయగా, ఇదే సమయంలో విడుదలవుతున్న హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ చిత్రం ‘వార్ 2’ కేవలం రూ. 2.08 కోట్లు మాత్రమే రాబట్టింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 6 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయని, బ్లాక్ సీట్లతో కలిపితే ఈ మొత్తం రూ. 20 కోట్లకు చేరువలో ఉందని నివేదికలు చెబుతున్నాయి. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల‌ 14న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ‘వార్ 2’తో హోరాహోరీ పోరు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.


More Telugu News