Road Accident: ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం .. ముగ్గురు కార్మికుల దుర్మరణం

Road Accident Three Sanitation Workers Died On ORR
  • రోడ్డు పక్కన నిద్రిస్తున్న కూలీలపైకి దూసుకువెళ్లిన ట్రాలీ ఆటో 
  • ఒడిశాకు చెందిన కూలీలు నారాయణ, చెక్మోహన్, జైరామ్ మృతి
  • మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర అవుటర్ రింగ్ రోడ్డుపై ఘటన
ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో ముగ్గురు కూలీలు మృతి చెందిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన నారాయణ (28), చెక్మోహన్ (24), జైరామ్ (32) అనే ముగ్గురు వ్యక్తులు రెండు రోజుల క్రితమే జీవనోపాధి కోసం శామీర్‌పేటకు వలస వచ్చారు. వారు రింగ్ రోడ్డు వెంబడి మొక్కల వద్ద కలుపు మొక్కలు తొలగించే పనిలో చేరారు.

కూలీలు రోడ్డు పక్కన కలుపు తీసిన అనంతరం మధ్యాహ్నం భోజనం చేసి అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో విశాఖపట్నం నుండి సెల్ ఫోన్ టవర్ సామగ్రితో మేడ్చల్‌కు వస్తున్న ట్రాలీ ఆటో అదుపుతప్పి రింగ్ రోడ్డు పక్కనున్న రెయిలింగ్‌ను ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన విశ్రాంతి తీసుకుంటున్న కూలీలపైకి దూసుకెళ్లింది.

ఇది గమనించి కొందరు కూలీలు తప్పించుకోగా, ముగ్గురు కూలీలు తప్పించుకోలేక పోవడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాలీ ఆటో డ్రైవర్ గణేశ్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కీసర సీఐ ఆంజనేయులు తెలిపారు. 
Road Accident
Keesara ORR
Medchal Malkajgiri
Outer Ring Road
Sanitation Workers Death
Trolley Auto Accident
Telangana Road Accident
Shamirpet
Odisha Workers

More Telugu News