KTR: మా హయాంలో చేసిన‌ అప్పులపై రేవంత్‌ చెబుతున్నవన్నీ అబద్ధాలే: కేటీఆర్‌

KTR Says Revanth Reddy Lied About Telangana Debts
  • కేసీఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందన్న సీఎం రేవంత్ రెడ్డి
  • తాజాగా కేంద్ర ప్రభుత్వం గ‌ట్టి సమాధానం ఇచ్చిందన్న కేటీఆర్‌
  • కేవలం 3.5 లక్షల కోట్లు మాత్రమే త‌మ హ‌యాంలో చేసిన అప్పులంటూ వివ‌ర‌ణ‌
  • ఈ నిజాన్ని ఇవాళ‌ స్వయంగా కేంద్ర ప్రభుత్వమే అంగీక‌రించింద‌ని వెల్ల‌డి
కేసీఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందన్న సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం గ‌ట్టి సమాధానం ఇచ్చిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఆరోపిస్తున్నట్టుగా తమ హయాంలో రాష్ట్ర అప్పు 8 లక్షల కోట్లు కాదని, కేవలం 3.5 లక్షల కోట్లు మాత్రమే అన్న నిజాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే అంగీక‌రించింద‌ని పేర్కొన్నారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలన్న సంగతి పార్లమెంట్‌లో ఈ రోజు నిరూపించబడిందని తెలిపారు. గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దిగ‌జార్చ‌డానికి రూ. 8 లక్షల కోట్ల అప్పులంటూ నిరాధార ప్రచారానికి దిగిన రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని కేటీఆర్ నిల‌దీశారు. 

తాము అధికారం నుంచి దిగిపోయిన తర్వాత అంటే 2024 మార్చి 31 నాటికి తెలంగాణ ప్రభుత్వ అప్పు రూ. 3,50,520.39 కోట్లు మాత్రమేనని స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ అనవసరంగా అప్పులు చేయలేదని కేటీఆర్ అన్నారు. సంక్షేమ పథకాలకే కాకుండా, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఆస్తుల సృష్టి కోసమే తెచ్చిన అప్పులను ఉపయోగించిందన్నారు. 

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు వివిధ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆ నిధులను ఖర్చు చేసిందని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ అప్పులు రూ. 3,50,520.39 కోట్లు అయితే, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల విలువ రూ. 4,15,099.69 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. అంటే, అప్పుల కంటే ఆస్తుల విలువ రూ. 64,579 కోట్లు ఎక్కువని వివ‌రించారు. 
KTR
KTR Telangana
Revanth Reddy
Telangana debts
BRS government
Telangana loans
Telangana economy
Mission Bhagiratha
Kaleshwaram Project
Telangana assets

More Telugu News