Rahul Gandhi: రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలి: స్టాలిన్

Stalin Demands Investigation into Rahul Gandhis Allegations Against EC BJP
  • బీజేపీ, ఈసీ నేరపూరిత మోసాలకు పాల్పడ్డాయన్న స్టాలిన్
  • ఈసీని బీజేపీ రిగ్గింగ్ యంత్రంగా మార్చిందని మండిపాటు
  • ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేమని వ్యాఖ్య
బీజేపీ, ఎలక్షన్ కమిషన్ కలిసి నేరపూరిత మోసాలకు పాల్పడ్డాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మద్దతు పలికారు. ఈసీని బీజేపీ రిగ్గింగ్ యంత్రంగా మార్చిందని ఆయన మండిపడ్డారు. పోలింగ్ కు సంబంధించి జరుగుతున్న అక్రమాలపై పోరాటంలో కాంగ్రెస్ తో డీఎంకే కలిసి నడుస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే అపహాస్యంపాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేమని అన్నారు. రాహుల్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, ప్రతి పౌరుడి ఓటు హక్కు కోసం ప్రతిపక్షాలు నిరసన తెలుపుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. స్పష్టమైన ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నియోజకవర్గంలో సర్వే నిర్వహించగా... దాదాపు లక్ష నకిలీ ఓట్లు తేలాయని గుర్తు చేశారు. ఈ నిజాన్ని దేశం ముందు ఉంచామని... అయినప్పటికీ ఎన్నికల కమిషన్ మాత్రం దీనిపై మౌనంగా ఉందని విమర్శించారు. 

ఇంకోవైపు ఈరోజు ఢిల్లీలో విపక్ష పార్టీల ఎంపీలు నిర్వహించిన 'పార్లమెంట్ టు ఈసీ' ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. అఖిలేశ్ యాదవ్ సహా పలువురు విపక్ష ఎంపీలు బ్యారికేడ్లు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాహుల్, ప్రియాంక సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
Rahul Gandhi
Stalin
Election Commission
BJP
India Elections
Voter List
Electoral Fraud
DMK
Congress
Opposition Protest

More Telugu News