Yash Dayal: ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్‌కు భారీ షాక్!

RCB Pacer Yash Dayal Barred From Competing In This League Due To Alleged Sexual Exploitation Case
  • లైంగిక ఆరోపణలతో చిక్కుల్లో ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్
  • యూపీ టీ20 లీగ్‌లో ఆడేందుకు అనుమతి నిరాకరణ
  • పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు
  • మైనర్‌పై లైంగిక దాడి చేశాడంటూ మరో పోక్సో కేసు నమోదు
  • నిషేధంపై తమకు సమాచారం లేదన్న గోరఖ్‌పూర్ లయన్స్ ఫ్రాంచైజీ
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడుతున్న యువ పేసర్ యశ్ దయాల్ తీవ్రమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఆయనపై నమోదైన లైంగిక ఆరోపణల కేసులు ఆయన క్రికెట్ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ కేసుల కారణంగా ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్‌లో ఆడేందుకు ఆయనపై నిషేధం విధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఆయన దేశవాళీ కెరీర్‌ను ప్రమాదంలో పడేసింది.

వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జరిగిన యూపీ టీ20 లీగ్ వేలంలో గోరఖ్‌పూర్ లయన్స్ ఫ్రాంచైజీ రూ. 7 లక్షలకు యశ్ దయాల్‌ను కొనుగోలు చేసింది. అయితే, ఆయనపై నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) ఈ టోర్నమెంట్‌లో ఆడేందుకు అనుమతి నిరాకరించినట్లు ప్రముఖ హిందీ పత్రిక 'దైనిక్ జాగరణ్' ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే, ఈ విషయంపై గోరఖ్‌పూర్ లయన్స్ జట్టు యజమాని విశేష్ గౌర్ స్పందిస్తూ, యూపీసీఏ నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని స్పష్టం చేశారు.

ఏమిటీ ఆరోపణలు?
27 ఏళ్ల యశ్ దయాల్‌పై రెండు వేర్వేరు లైంగిక ఆరోపణల కేసులు నమోదయ్యాయి. ఘజియాబాద్‌కు చెందిన ఒక యువతి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి యశ్ దయాల్ తనను లైంగికంగా వాడుకున్నాడని ఆరోపిస్తూ జూలై 6న పోలీసులకు ఫిర్యాదు చేసింది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 69 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐదేళ్ల క్రితం తామిద్దరూ కలిశామని, అప్పటి నుంచి పెళ్లి ప్రతిపాదనను దయాల్ వాయిదా వేస్తూ వస్తున్నాడని, అతనికి ఇతర మహిళలతో కూడా సంబంధాలున్నాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని, తన అరెస్టుపై స్టే విధించాలని కోరుతూ యశ్ దయాల్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండా మోసం చేస్తేనే సెక్షన్ 69 వర్తిస్తుందని ఆయన తన పిటిషన్‌లో వాదించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, ఆయన అరెస్టుపై మధ్యంతర స్టే విధించింది.

ఇదిలా ఉండగానే, జైపూర్‌లో మరో తీవ్రమైన కేసు నమోదైంది. మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఆయనపై పోక్సో చట్టం కింద, బీఎన్ఎస్ సెక్షన్ 64 కింద మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితురాలికి 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింద‌ని పోలీసులు తెలిపారు. ఇలా వరుసగా తీవ్రమైన కేసులు నమోదు కావడంతో యశ్ దయాల్ క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
Yash Dayal
Yash Dayal controversy
RCB
Royal Challengers Bangalore
UP T20 League
Sexual assault allegations
Indian Penal Code
POCSO Act
Cricket
Uttar Pradesh Cricket Association

More Telugu News