‘వార్ 2’ వేదికపై ఎన్టీఆర్ భావోద్వేగం.. తన తొలి అభిమానిని పరిచయం చేసిన తారక్

  • హైదరాబాద్‌లో ఘనంగా ‘వార్ 2’ ప్రీ రిలీజ్ వేడుక
  • హాజరైన ఎన్టీఆర్, హృతిక్ రోషన్, పలువురు సినీ ప్రముఖులు
  • తన తొలి అభిమానిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన తారక్
  • సినిమా రిలీజ్‌కు ముందే ముజీబ్ అభిమానిగా మారాడని వెల్లడి
  • ఈ నెల‌ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘వార్ 2’
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘వార్ 2’. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ తన 25 ఏళ్ల సినీ ప్రస్థానంలోని ఓ మధురమైన జ్ఞాపకాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే తనను అభిమానించిన తొలి అభిమాని గురించి వేదికపై వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, "25 ఏళ్ల క్రితం ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నా కెరీర్ మొదలైంది. దివంగత రామోజీరావు గారు నన్ను పరిచయం చేశారు. ఆ సినిమా ప్రారంభోత్సవానికి నా పక్కన అమ్మ, నాన్న తప్ప ఎవరూ లేరు. అప్పట్లో మెహదీపట్నంలో ఓ రెంటెడ్ ఆఫీస్ ఉండేది. ఒకరోజు ఆదోనికి చెందిన‌ ముజీబ్ అహ్మ‌ద్‌ అనే వ్యక్తి ఆఫీసుకు వచ్చి, ‘నేను మీకు పెద్ద ఫ్యాన్, మీ కోసం పడి చచ్చిపోతా’ అన్నాడు. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాని నాకు అప్పుడే ఫ్యాన్ ఏంటి? అని షాక్ అయ్యాను. అప్పటి నుంచి ముజీబ్ నాతోనే ఉన్నాడు. అతని తర్వాత ఎంతో మంది అభిమానులు నాపై ప్రేమను పంచారు" అని ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు.

హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లతో పాటు దర్శకుడు అయాన్ ముఖర్జీ, నిర్మాతల బృందం, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత దిల్ రాజు వంటి పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సూర్యదేవర నాగవంశీకి ఎన్టీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

యశ్‌ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.


More Telugu News