హంద్రీ-నీవాలో కృష్ణమ్మ పరవళ్లు చూసి నా మనసు పులకరిస్తోంది: సీఎం చంద్రబాబు

  • హంద్రీ-నీవా ప్రాజెక్టులో నీటి ప్రవాహంపై సీఎం చంద్రబాబు హర్షం
  • రాయలసీమలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమన్న సీఎం
  • రికార్డు సమయంలో కాల్వల విస్తరణ వల్లే ఇది సాధ్యమైందని వెల్లడి
  • చివరి భూములకు కూడా నీరందించాలనే కల నెరవేరుతోందని వ్యాఖ్య
  • రైతుల సంతోషం తమ సంకల్పానికి మరింత బలాన్నిస్తోందన్న చంద్రబాబు
రాయలసీమకు జీవనాడి అయిన హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో కృష్ణా జలాల ప్రవాహంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు చూసి తన మనసు పులకరించిపోయిందని తెలిపారు. ఈ సీజన్‌లో ప్రాజెక్టు కింద ఉన్న చివరి భూములకు సైతం నీరందించాలనే తమ కల సాకారమవుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా, ప్రభుత్వం రికార్డు సమయంలో కాల్వల విస్తరణ పనులను చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ పనుల వల్లే ప్రస్తుతం హంద్రీ-నీవా కాల్వల్లో నీటి ప్రవాహం అత్యధిక సామర్థ్యంతో కొనసాగుతోందని పేర్కొన్నారు.

ప్రతి ప్రాజెక్టును, ప్రతి చెరువును నింపి, చివరి ఆయకట్టు భూములను కూడా తడపాలన్నదే తమ ఆశయమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం కాల్వల్లోని నీటి ప్రవాహాలు రైతుల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తున్నాయని తెలిపారు. రైతుల ముఖాల్లో కనిపిస్తున్న సంతోషం, తమ ప్రభుత్వ సంకల్పానికి మరింత బలాన్ని చేకూరుస్తోందని చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.


More Telugu News