Abhineet Gupta: బిగ్ బాస్ షోలో అవకాశం అంటూ డాక్టర్ కు టోకరా

Abhineet Gupta Cheated in Big Boss Opportunity Scam
  • సీజన్ 16, 17లో అవకాశం అంటూ.. డాక్టర్‌ను రెండేళ్లుగా తిప్పిన కేటుగాడు!
  • భోపాల్‌కు చెందిన డాక్టర్ అభినీత్ గుప్తా నుంచి రూ. 10 లక్షల వసూలు
  • నిందితుడు కరణ్ సింగ్‌పై ముంబై పోలీసులకు ఫిర్యాదు
  • సీజన్ 16, 17లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ రెండేళ్లుగా మాయమాటలు
  • మోసం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
దేశవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన టెలివిజన్ రియాలిటీ షో 'బిగ్ బాస్'లో పాల్గొనే అవకాశం ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి తనను రూ. 10 లక్షలు మోసం చేశాడని భోపాల్‌కు చెందిన చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ అభినీత్ గుప్తా ఆరోపించారు. ఈ ఘటనపై ఆయన ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గతంలో భోపాల్‌లోనూ ఓసారి ఫిర్యాదు చేసినప్పటికీ, తాజాగా ముంబైలో కేసు నమోదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అభినీత్ గుప్తా ఈ మోసం వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, 2022లో కరణ్ సింగ్ అనే వ్యక్తి తనను సంప్రదించి, 'బిగ్ బాస్' నిర్వాహకులతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని నమ్మబలికాడు. షోలో పాల్గొనేందుకు మొదట కోటి రూపాయలు డిమాండ్ చేయగా, అంత డబ్బు తన వద్ద లేదని అభినీత్ చెప్పారు. ఆ తర్వాత రూ. 60 లక్షలకు ఒప్పందం కుదిరిందని, ఆ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాలని కరణ్ సూచించాడు.

ఈ క్రమంలోనే తనను ముంబైకి పిలిపించి, ఎండెమోల్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హరీశ్ షాతో సమావేశం ఏర్పాటు చేసినట్లు కరణ్ చెప్పాడని, ఆ తర్వాత డబ్బు డిమాండ్ చేయడంతో తాను రూ. 10 లక్షలు అతడికి బదిలీ చేశానని అభినీత్ పేర్కొన్నారు. అయితే, 'బిగ్ బాస్ సీజన్ 16' కంటెస్టెంట్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో కరణ్‌ను ప్రశ్నించగా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మధ్యలో పంపిస్తానని చెప్పాడని తెలిపారు.

ఆ సీజన్ ముగిశాక, తర్వాతి సీజన్‌లో అవకాశం ఇప్పిస్తానని మాట మార్చాడని అభినీత్ ఆవేదన వ్యక్తం చేశారు. "సీజన్ 17 కూడా ముగిసిపోవడంతో నా డబ్బు వాపస్ ఇవ్వాలని కరణ్‌ను కోరాను. కానీ అతడు నన్ను తిప్పుతూనే ఉన్నాడు. చివరకు పోలీసులను ఆశ్రయించగా, దాదాపు రెండేళ్ల తర్వాత ఎంతో కష్టపడి ఎఫ్ఐఆర్ నమోదు చేయగలిగాను" అని ఆయన వివరించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 420 కింద మోసం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తనలా మరెవరూ ఇలాంటి మోసగాళ్ల బారిన పడకూడదనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని బయటపెడుతున్నట్లు అభినీత్ గుప్తా స్పష్టం చేశారు.
Abhineet Gupta
Big Boss
Big Boss Telugu
reality show
Karan Singh
Harish Shah
Endemol
fraud
cheating case
Mumbai police

More Telugu News