AP Singh: భారత ఎయిర్ చీఫ్ మార్షల్ వ్యాఖ్యలకు పాక్ స్పందన

AP Singh Pakistan reacts to Indian Air Chief Marshal remarks
  • భారత్ చేసిన దాడుల్లో ఒక్క యుద్ధ విమానం కూడా దెబ్బతినలేదన్న పాక్ రక్షణ మంత్రి అసిఫ్
  • భారత ఎయిర్ చీఫ్ మార్షల్ వ్యాఖ్యలను ఖండించిన అసిఫ్
  • ప్రపంచం కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం పాక్ చేస్తుందన్న విమర్శలు  
భారత్‌పై పాకిస్థాన్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చేసినట్లు ఇటీవల భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ స్పందించారు.

భారత్ చేసిన దాడుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఒక్క యుద్ధ విమానం కూడా దెబ్బతినలేదని ఆయన అన్నారు. తాము అంతర్జాతీయ మీడియాకు వివరాలు వెల్లడించామన్నారు. మూడు నెలలుగా ఎలాంటి వాదనలు లేవని, ఇంత ఆలస్యంగా చేసిన వాదనలు నమ్మశక్యంగా లేవని పేర్కొన్నారు.

ఉగ్రవాద శిబిరాలను భారత్ నేలమట్టం చేసినప్పటికీ తమ సైన్యానికి సంబంధించి ఒక్క విమానం కూడా దెబ్బతినలేదని బుకాయిస్తూ ప్రపంచం కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం పాక్ చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ – 400 క్షిపణి వ్యవస్థలు సమర్థవంతంగా పని చేశాయన్నారు. పాక్ ప్రధాన ఎయిర్ ఫీల్డ్‌లలో షహబాజ్ జకోబాబాద్ స్థావరం సగానికి పైగా దెబ్బతిందని, కనీసం ఐదు యుద్ధ విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయనే అంచనాకు వచ్చామని సింగ్ వెల్లడించారు.

పక్కా యాక్షన్ ప్లాన్‌తో ఆపరేషన్ చేపట్టామని, కేవలం 80 నుంచి 90 గంటల్లోనే లక్ష్యాలను సాధించామని వెల్లడించారు. యుద్ధం ఇలానే కొనసాగితే భారీ మూల్యం తప్పదని దాయాదికి అర్థమైందని, అందుకే కాళ్లబేరానికి రావడం జరిగిందని సింగ్ అన్నారు. 
AP Singh
Pakistan
Indian Air Force
Air Chief Marshal
Operation Sindoor
Khawaja Asif
S-400 missile system
Shahbaz Jakobaabad
India Pakistan relations
defence

More Telugu News