Lionel Messi: కేరళలో ‘మెస్సీ’ మంటలు.. ప్రభుత్వానికి రాజకీయ తలనొప్పి

Messi is missing Congress slams Kerala govt over failed invite
  • ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ కేరళ పర్యటన రద్దుపై తీవ్ర వివాదం
  • ఒప్పందాన్ని ఉల్లంఘించింది కేరళ ప్రభుత్వమేనని ఏఎఫ్ఏ ఆరోపణ
  • పాలక సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కాంగ్రెస్
  • మంత్రి స్పెయిన్ పర్యటనకు రూ.13 లక్షల వ్యయంపై రేగిన దుమారం
  • తమ ప్రమేయం లేదని, ఇది స్పాన్సర్ల వ్యవహారమని కేరళ క్రీడల మంత్రి వివ‌ర‌ణ‌
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, అర్జెంటీనా జాతీయ జట్టు కేరళ పర్యటన రద్దు కావడం రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించింది కేరళ ప్రభుత్వమేనని అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ) నేరుగా ఆరోపించడంతో, పినరయి విజయన్ సర్కార్ రాజకీయంగా ఇరకాటంలో పడింది. కాంట్రాక్టు నిబంధనలను పాటించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏఎఫ్ఏ మార్కెటింగ్ హెడ్ లియాండ్రో పీటర్సన్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలను రాష్ట్ర క్రీడల మంత్రి వి. అబ్దురహిమాన్ ఖండించారు.

ఈ పరిణామంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 'మెస్సీ కనబడటం లేదు' అంటూ కేపీసీసీ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ ఎద్దేవా చేశారు. ఈ గందరగోళానికి క్రీడల మంత్రి స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 'మెస్సీ కేరళకు వస్తున్నాడు' అంటూ ప్రభుత్వం చేసిన సోషల్ మీడియా ప్రచారం పూర్తిగా బెడిసికొట్టిందని కాంగ్రెస్ ఎంపీ షఫీ పరంబిల్ విమర్శించారు. ఈ ప్రచారానికి ప్రజాధనాన్ని ఖర్చు చేసి ఉంటే, ఆ డబ్బును ప్రభుత్వ ఖజానాకు తిరిగి జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూతతిల్ మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) పార్టీకి సరైన నాయకులు లేక మెస్సీని తమ 'స్టార్ క్యాంపెయినర్‌'గా వాడుకోవాలని చూసిందని, ఎన్నికల సమయంలోనే ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తారని ఆరోపించారు.

ఈ వివాదం మధ్యలోనే మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మెస్సీని ఆహ్వానించేందుకు 2024 సెప్టెంబర్‌లో క్రీడల మంత్రి అబ్దురహిమాన్ స్పెయిన్ పర్యటనకు వెళ్లగా, ఆ పర్యటనకు ప్రభుత్వ ఖజానా నుంచి రూ.13 లక్షలు ఖర్చు చేసినట్లు తేలింది. ఈ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదని మంత్రి గతంలో హామీ ఇవ్వడం గమనార్హం. ఆయనతో పాటు క్రీడల శాఖ కార్యదర్శి, డైరెక్టర్ కూడా స్పెయిన్ వెళ్లారు.

శనివారం మంత్రి అబ్దురహిమాన్ మాట్లాడుతూ.. అక్టోబర్-నవంబర్ నెలల్లో షెడ్యూల్ సమస్యల కారణంగా మెస్సీ, అర్జెంటీనా జట్టు రావడం లేదని ధ్రువీకరించారు. ఈ ఒప్పందంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా స్పాన్సర్‌కు, ఏఎఫ్ఏకు మధ్య జరిగిన వ్యవహారమని ఆయన స్పష్టం చేశారు. తాము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశామని, కానీ ఏఎఫ్ఏనే పర్యటనను ఖరారు చేయలేకపోయిందని తెలిపారు. ఏదేమైనా, ఈ ఘటన కేరళ ప్రభుత్వానికి పెద్ద రాజకీయ తలనొప్పిగా మారింది.
Lionel Messi
Kerala government
Argentina football association
Pinarayi Vijayan
Kerala sports minister
football controversy
Sunny Joseph
Shafi Parambil
Rahul Mamkootathil
AFA marketing head

More Telugu News