Savitha: వైసీపీకి పులివెందులలో ఓటమి భయం పట్టుకుంది: మంత్రి సవిత

Minister Savitha Slams YSRCP Over Pulivendula Politics
  • వైసీపీ నేతలపై మంత్రి సవిత ఫైర్
  • డైవర్షన్ పాలిటిక్స్ తో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శ
  • వైసీపీ దాడుల వల్లే సునీత పులివెందులకు రాలేకపోతున్నారని వ్యాఖ్య
  • దాడులు చేసి ఆ నిందను టీడీపీపై మోపుతున్నారని ఆరోపణ
  • సూపర్ సిక్స్ పథకాలతో పులివెందులలో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా
పులివెందులలో వైసీపీ నాయకులు ఓటమి భయంతో డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారని రాష్ట్ర మంత్రి సవిత తీవ్రస్థాయిలో ఆరోపించారు. జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోతామనే ఆందోళనతోనే వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టిస్తూ, ఆ నిందను టీడీపీపై మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు.

పులివెందులలో నెలకొన్న పరిస్థితులపై మంత్రి సవిత మాట్లాడుతూ, "వైసీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, బెదిరింపుల కారణంగా వైఎస్ వివేకానంద రెడ్డి జయంతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన కుమార్తె సునీత కూడా భయపడుతున్నారు. గత మూడు రోజులుగా జరుగుతున్న దాడుల వెనుక వైసీపీ నేతలే ఉన్నారు. వారే దాడులు చేయించి, దాన్ని టీడీపీకి అంటగట్టాలని చూస్తున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు" అని సవిత తెలిపారు.

పులివెందులలో టీడీపీ గెలుపు ఖాయమని మంత్రి సవిత ధీమా వ్యక్తం చేశారు. "గత ఏడాదిగా పులివెందులలో ప్రశాంత వాతావరణం నెలకొంది. మా సూపర్‌సిక్స్‌ పథకాలకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ సానుకూలతల నేపథ్యంలో ఇక్కడి రెండు స్థానాలనూ టీడీపీ కైవసం చేసుకుంటుంది. ఈ నిజాన్ని జీర్ణించుకోలేకే వైసీపీ నేతలు ధర్నాలు చేయడం, పోలీసులను బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు" అని ఆమె పేర్కొన్నారు.

'జగన్ రప్పా.. రప్పా' వంటి నినాదాలు, వైసీపీ నేతల అసభ్యకర వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలను ఎదుర్కొంటుందని మంత్రి సవిత స్పష్టం చేశారు.
Savitha
Minister Savitha
AP Minister Savitha
Pulivendula
YSRCP
TDP
YS Vivekananda Reddy
Sunitha
Andhra Pradesh Politics
ZPTC Elections

More Telugu News