సిట్ విచారణపై నమ్మకం లేదు.. సీబీఐ చేత దర్యాప్తు చేయించాలి: బండి సంజయ్

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవుతున్న బండి సంజయ్
  • తన వద్ద ఉన్న ఆధారాలను అధికారులకు ఇస్తానన్న కేంద్ర మంత్రి
  • కీలక ఆధారాలు ఉన్నప్పటికీ ఒక్క అరెస్ట్ కూడా జరగలేదని విమర్శ
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం రేపుతోంది. తాజాగా ఈ కేసులో సిట్ నుంచి నోటీసులు అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ నేడు విచారణకు హాజరవుతున్నారు. తన ఫోన్లు ట్యాపింగ్ చేసిన వ్యవహారంపై తన వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ముందుగా ఆయన ఖైరతాబాద్ లోని హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అక్కడినుంచి పాదయాత్రగా ఆయన దిల్ కుషా గెస్ట్ హౌస్ కు బయలుదేరారు.

ఈ సందర్భంగా మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ... విచారణకు రావాలని నెల రోజుల క్రితమే సిట్ కోరిందని తెలిపారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని కూడా సిట్ అధికారులకు అందజేస్తానని చెప్పారు. 

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తన ఫోన్ నే ఎక్కువ ట్యాప్ చేశారని సంజయ్ తెలిపారు. ఈ విషయంపై గతంలోనే పోలీసులకు తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని... సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని అన్నారు. రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ ను కాపాడుతోందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక ఆధారాలు ఉన్నప్పటికీ... ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య దోస్తీ ఉంది కాబట్టే అరెస్టులు జరగడం లేదని అన్నారు. ఇదంతా టైమ్ పాస్ వ్యవహారంలా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.


More Telugu News