Shashi Tharoor: రాహుల్ గాంధీ ఆరోపణలకు శశి థరూర్ మద్దతు

Shashi Tharoor Supports Rahul Gandhi Allegations on Election Fraud
  • 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ, ఈసీ కుమ్మక్కయ్యాయని రాహుల్ ఆరోపణ
  • అందుకు బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ సీటును ఉదాహరణగా చూపిన కాంగ్రెస్ అగ్రనేత
  • ప్రజాస్వామ్యాన్ని మోసం ద్వారా నాశనం కానివ్వకూడదంటూ రాహుల్ ఆరోపణలకు శశిథరూర్ మద్దతు
2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కుమ్మక్కై ‘భారీ క్రిమినల్ మోసం’ చేశాయంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ మద్దతు పలికారు. ఇటీవల పార్టీ హైకమాండ్‌తో విభేదిస్తున్న థరూర్ మద్దతు ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఎన్నికల ప్రక్రియ ‘తొలుత నిర్దేశించినట్లుగానే’ జరిగిందని, ఈసీ బీజేపీతో కలిసి పనిచేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనికి రుజువుగా ఆయన కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఉదాహరణగా చూపారు. అక్కడ బీజేపీకి 1,14,046 ఓట్ల భారీ ఆధిక్యం రావడంతో, బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ సీటును 32,707 ఓట్ల మెజారిటీతో గెలుచుకుందని తెలిపారు. 

కాంగ్రెస్ ఇతర నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నా, కేవలం ఒక నియోజకవర్గంలో వచ్చిన ఆధిక్యం వల్ల ఫలితం మారిపోయిందని ఆయన అన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో 10-15 సంవత్సరాల ఓటరు డేటాను, పోలింగ్ కేంద్రాల సీసీటీవీ ఫుటేజీని ఇవ్వాలని రాహుల్ గాంధీ ఈసీని డిమాండ్ చేశారు. ‘ఈసీ మాకు ఈ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వకపోతే, వారు ఈ నేరంలో భాగస్వాములైనట్టే’ అని ఆయన స్పష్టం చేశారు.

శశి థరూర్ తన ఎక్స్ పోస్ట్‌లో ‘ఈ ప్రశ్నలు చాలా తీవ్రమైనవి, అన్ని పార్టీలు, ఓటర్ల ప్రయోజనాల దృష్ట్యా వీటిని పరిష్కరించాలి. మన ప్రజాస్వామ్యం చాలా విలువైనది, దాని విశ్వసనీయతను అసమర్థత, నిర్లక్ష్యం లేదా కావాలని చేసిన మోసం ద్వారా నాశనం కానివ్వకూడదు’ అని పేర్కొన్నారు. ఈ విషయాలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆయన ఈసీని కోరారు. గత ఆరు నెలలుగా ప్రధాని మోదీని పొగడటం, ఎమర్జెన్సీపై విమర్శలు చేయడంతో పార్టీ ఆగ్రహానికి గురైన థరూర్ ఇప్పుడు రాహుల్‌కు మద్దతు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

మరోవైపు, రాహుల్ గాంధీ ‘నిరాధార ఆరోపణలు’ చేస్తున్నారని బీజేపీ ఖండించింది. బీజేపీ విజయాన్ని మోసంగా అభివర్ణించడం ఓటర్లను అవమానించడమే అని పేర్కొంది. కాంగ్రెస్ పదేపదే ఓడిపోవడంతో కలిగిన ‘నిరాశ, కోపం’తోనే రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇలాంటి ‘నిర్లక్ష్య, సిగ్గుమాలిన’ ప్రవర్తన వల్ల ఓటర్లు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తూనే ఉంటారని బీజేపీ పేర్కొంది. 
Shashi Tharoor
Rahul Gandhi
BJP
Election Commission of India
2024 Lok Sabha elections
criminal fraud
voter data
CCTV footage
Karnataka elections
Mahadevapura

More Telugu News