India US Trade War: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందానికి బ్రేక్

India Halts 36 Billion Dollar Defense Deal with US
  • 3.6 బిలియన్ డాలర్ల బోయింగ్ ఒప్పందానికి బ్రేక్
  • పీ-8ఐ నిఘా విమానాల కొనుగోలు డీల్ నిలిపివేత
  • టారిఫ్ల కారణంగా భారీగా పెరిగిన విమానాల ధర
  • భారత్ నిర్ణయంతో బోయింగ్ సంస్థకు తీవ్ర నష్టం
  • అమెరికా సుంకాలు అన్యాయమన్న భారత్
భారత్, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. భారత దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం టారిఫ్లు విధించడంతో దానికి ప్రతిగా భారత్ తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన విమాన తయారీ దిగ్గజం బోయింగ్‌తో దాదాపు తుది దశలో ఉన్న 3.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 30,000 కోట్లు) కీలక రక్షణ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాల్లో ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.

అసలు ఒప్పందం ఏమిటి?
భారత నౌకాదళం కోసం ఆరు అధునాతన పీ-8ఐ పొసైడాన్ విమానాలను బోయింగ్ నుంచి కొనుగోలు చేసేందుకు ఈ ఒప్పందం కుదిరింది. సముద్రంపై సుదూర నిఘా, జలాంతర్గాములను గుర్తించి ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ విమానాల ప్రత్యేకత. వాస్తవానికి 2014లో ఈ ఒప్పందం విలువ 2.42 బిలియన్ డాలర్లుగా ఉండేది. కానీ ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసులో అంతరాయాలు, తాజాగా విడిభాగాలపై అమెరికా విధించిన 25 శాతం సుంకాల‌ కారణంగా దీని ధర 3.6 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది. ప్రాజెక్టు వ్యయం దాదాపు 50 శాతం పెరగడంతో భారత్ ఈ కొనుగోలుపై పునరాలోచనలో పడింది.

భారత్ ఎందుకీ నిర్ణయం తీసుకుంది?
రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేస్తుండటం, తద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఆజ్యం పోస్తోందని ఆరోపిస్తూ ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై భారీ టారిఫ్లను విధించింది. ఈ టారిఫ్ల కారణంగానే పీ-8ఐ విమానాల ధర విపరీతంగా పెరిగిపోయింది. పెరిగిన ఖర్చుతో పాటు, అమెరికా వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందాన్ని ప్రస్తుతానికి నిలిపివేయాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయం బోయింగ్ సంస్థకు భారీ నష్టాన్ని కలిగించనుంది. భారత్‌లో బోయింగ్ సంస్థకు సుమారు 5000 మంది ఉద్యోగులు ఉండటంతో పాటు, ఏటా 1.7 బిలియన్ డాలర్ల మేర భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందిస్తోంది. మరోవైపు, హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విమానాల అవసరం భారత నౌకాదళానికి ఎంతో ఉంది. ఇప్పటికే భారత్ వద్ద 12 పీ-8ఐ విమానాలు ఉన్నాయి. 

వాటికి అదనంగా మరో ఆరింటిని సమకూర్చుకోవాలని భావించినా, తాజా పరిణామాలతో దేశీయంగా డీఆర్‌డీఓ, హెచ్ఏఎల్ వంటి సంస్థల ద్వారా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఒప్పందం రద్దు కానప్పటికీ, టారిఫ్ వివాదం పరిష్కారమయ్యే వరకు నిరవధికంగా నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
India US Trade War
Donald Trump
Boeing
P-8I Poseidon
Indian Navy
defence deal
tariffs
India defense
US tariffs
India Russia oil

More Telugu News