: అక్కను వేధిస్తున్న బావ.. రైలు కిందకు తోసి హత్య చేసిన బావమరిది

  • హైదరాబాద్‌లోని కాచిగూడలో ఘటన
  • మద్యం తాగి తరచూ భార్యను వేధిస్తున్న సిరాజ్
  • అక్క ఫోన్ చేసి చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన సోదరుడు
  • అర్ధరాత్రి వేళ మలక్‌పేట తీసుకెళ్లి దారుణం
మద్యం మత్తులో తరచూ తన అక్కను వేధిస్తున్న బావను రైలు కిందికి తోసి హత్య చేశాడో బావమరిది. హైదరాబాద్‌లోని కాచిగూడలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పాత మలక్‌పేటకు చెందిన సిరాజ్ (29), యాకుత్‌పురకు చెందిన సానియా (23)ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుని అత్తవారింట్లో ఉంటున్నాడు. సిరాజ్ నిత్యం మద్యం తాగి సానియాను కొడుతూ వేధించేవాడు. ఈ నెల 2న సిరాజ్ తన భార్యను తీసుకుని ఓల్డ్ మలక్‌పేటలోని తన ఇంటికి వెళ్లాడు. అక్కడ కూడా వారిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది.

భర్త నిత్యం తనను హింసిస్తుండటంతో సానియా తన తమ్ముడు సయ్యద్ జమీర్ (21)కు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే జమీర్ తన స్నేహితుడు ఎండీ జునైద్ (23)తో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో జమీర్, జునైద్ ఇద్దరూ సిరాజ్‌ను బైక్‌పై ఎక్కించుకుని మలక్‌పేట రైల్వే స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సిరాజ్, జమీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన జమీర్ అటువైపు వస్తున్న రైలు కిందకు సిరాజ్‌ను తోసివేయడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.

రైల్వే పోలీసులు స్టేషన్ ప్రాంగణంలోని నిఘా కెమెరాల సాయంతో సయ్యద్ జమీర్, అతడికి సహకరించిన జునైద్‌ను గుర్తించి గురువారం అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

More Telugu News