New Delhi: పార్కింగ్ గొడవ.. సినీ నటి హుమా ఖురేషీ దగ్గరి బంధువు దారుణ హత్య!

Actor Huma Qureshis Cousin Murdered Over Parking Space In Delhi
  • ఢిల్లీలో దారుణం.. నటి హుమా ఖురేషీ కజిన్ ఆసిఫ్ ఖురేషీ హత్య
  • ఇంటి ముందు స్కూటర్ పార్కింగ్ విషయంలో చెలరేగిన వివాదం
  • మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీయడంతో ప్రాణాలు తీసిన దుండగులు
  • ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ నటి హుమా ఖురేషీ దగ్గరి బంధువు ఆసిఫ్ ఖురేషీ (42) హత్యకు గురయ్యారు. కేవలం స్కూటర్ పార్కింగ్ విషయంలో చెలరేగిన చిన్న గొడవ ప్రాణం తీయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సంఘటన గురువారం రాత్రి 11 గంటల సమయంలో నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగింది. ఆసిఫ్ ఖురేషీ ఇంటి ముందు ఇద్దరు వ్యక్తులు తమ స్కూటర్‌ను అడ్డంగా పార్క్ చేశారు. ఇంటికి దారి లేకుండా ఉండటంతో స్కూటర్‌ను పక్కకు జరపమని ఆసిఫ్ వారిని కోరారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం మొదలైంది. అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీయడంతో, ఆగ్రహంతో ఊగిపోయిన ఆ ఇద్దరు వ్యక్తులు ఆసిఫ్‌పై దాడి చేసి దారుణంగా హత్య చేశారు.

ఈ ఘటనపై హుమా ఖురేషీ తండ్రి, ఆసిఫ్ మేనమామ అయిన సలీమ్ ఖురేషీ మాట్లాడుతూ, "ఇంటి ముందు ఇద్దరు వ్యక్తులు స్కూటర్ పెట్టారు. దారికి అడ్డంగా ఉందని పక్కకు తీయమని నా మేనల్లుడు అడిగాడు. దానికే పెద్ద గొడవ చేసి, ఇద్దరూ కలిసి వాడిని చంపేశారు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

మృతుడు ఆసిఫ్ ఖురేషీ స్థానికంగా చికెన్ వ్యాపారం నిర్వహిస్తున్నారని, ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని తెలిసింది. చిన్న కారణానికి ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడంపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
New Delhi
Huma Qureshi
Asif Qureshi murder
Delhi crime
Nizamuddin murder
parking dispute
crime news india
Huma Qureshi brother
Delhi police investigation

More Telugu News