Asaduddin Owaisi: ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు... బీజేపీ నేతల ప్రగల్భాలు ఇప్పుడేమయ్యాయి?: ఒవైసీ

Asaduddin Owaisi slams Trumps 50 percent tariffs on India
  • భారత్‌పై అమెరికా 50 శాతం సుంకం విధించడంపై ఒవైసీ తీవ్ర ఆగ్రహం
  • ఇది దౌత్యం కాదు, ట్రంప్ దాదాగిరి అంటూ ఘాటు విమర్శ
  • సుంకాల వల్ల ఉద్యోగాలు పోతాయి, ఎఫ్‌డీఐలు రావని ఆందోళన
  • ప్రధాని మోదీ 56 అంగుళాల ఛాతీ ఏమైందని సూటి ప్రశ్న
  • దేశ సార్వభౌమత్వాన్ని మిత్రుల కోసం తాకట్టు పెట్టారని ఆరోపణ
భారత్‌పై అమెరికా భారీ సుంకాలను విధించడంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 50 శాతం సుంకం విధించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇది దౌత్యం కాదని, అమెరికా అధ్యక్షుడి దాదాగిరి అని గురువారం 'ఎక్స్' వేదికగా విమర్శించారు.

అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. "ట్రంప్ మనపై మరో 25 శాతం సుంకాన్ని విధించారు, దీంతో మొత్తం సుంకం 50 శాతానికి చేరింది. అంతర్జాతీయ వాణిజ్యం ఎలా పనిచేస్తుందో తెలియని వ్యక్తి మనల్ని బెదిరిస్తున్నారు," అని ఆయన పేర్కొన్నారు. ఈ సుంకాల వల్ల భారత ఎగుమతిదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), తయారీదారులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. అంతేకాకుండా, సరఫరా గొలుసులు దెబ్బతిని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) తగ్గిపోయి, ఉద్యోగాలకు గట్టి దెబ్బ తగులుతుందని ఆయన హెచ్చరించారు.

ఈ పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనాన్ని ఒవైసీ తీవ్రంగా ప్రశ్నించారు. "ఈ విషయాలు నరేంద్ర మోదీకి ఎందుకు పట్టడం లేదు? బీజేపీ నేతల ప్రగల్భాలు ఇప్పుడు ఏమయ్యాయి?" అని నిలదీశారు. గతంలో ట్రంప్ 56 శాతం సుంకాలు విధిస్తే మోదీ తన 56 అంగుళాల ఛాతీని చూపిస్తారా అని తాను ప్రశ్నించానని, బహుశా అందుకే ట్రంప్ 50 శాతంతో ఆగిపోయారేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "దేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని మీ మిత్రులైన బిలియనీర్ల ఖజానాలు నింపడం కోసం తాకట్టు పెట్టారా?" అని ఒవైసీ ప్రశ్నించారు.

జూలై 31న కూడా ఇదే అంశంపై స్పందించిన ఒవైసీ, భారత్ ఒక స్వతంత్ర సార్వభౌమ దేశమని, అమెరికాకు సామంతు రాజ్యం కాదని అన్నారు. జపాన్‌పై 15 శాతం, వియత్నాంపై 20 శాతం, ఇండోనేషియాపై 19 శాతం సుంకాలు విధిస్తూ, భారత్‌పై మాత్రం కక్షపూరితంగా వ్యవహరించడం మన పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Asaduddin Owaisi
Donald Trump
India tariffs
US tariffs on India
Indian economy
Narendra Modi
BJP leaders
Russia oil imports
MSME sector
Foreign direct investment

More Telugu News