భూమన అనుచరుల దాడి ఘటన.. అసలు ఏంజరిగిందంటే..!

  • భూమన అనుచరుల గొడవపై తిరుపతి డీఎస్పీ ప్రెస్ మీట్
  • అనిల్ రెడ్డికి చెందిన ఎస్‌వీపీ రెంటల్స్ కంపెనీ నుంచి బైక్ తీసుకున్న గిరిజన యువకుడు
  • రెంట్ కట్టకుండా, బైక్ తిరిగివ్వకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు ఆరోపణ
  • తిరుపతి రైల్వే స్టేషన్‌ వద్ద దొరకడంతో తీసుకెళ్లి దాడి చేసిన అనిల్ రెడ్డి
తిరుపతిలో గిరిజన యువకుడిపై భూమన అనుచరుల దాడికి సంబంధించిన వీడియో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు. దాడి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తిరుపతి ఈస్ట్‌ డీఎస్పీ భక్తవత్సలం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు.
 
మాజీ ఎమ్మెల్యే భూమన కారు డ్రైవర్ గా పనిచేస్తున్న అనిల్ రెడ్డి తిరుపతిలో ‘ఎస్‌వీపీ బైక్‌ రైడర్స్‌ అండ్‌ రెంటల్స్‌’ కూడా నిర్వహిస్తున్నాడు. ఇటీవల పవన్ అనే గిరిజన యువకుడు బైక్‌ రెంట్‌కు తీసుకెళ్లాడు. అయితే, కొంతకాలంగా అద్దె చెల్లించక, బైక్‌ తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే పవన్ కోసం గాలిస్తున్న అనిల్ రెడ్డికి తిరుపతి రైల్వే స్టేషన్‌ వద్ద కనిపించాడు.

దీంతో అనిల్‌రెడ్డి, జగ్గారెడ్డి అలియాస్‌ జగదీష్‌, దినేశ్‌లు పవన్ ను ఎస్‌వీపీ రెంటల్స్‌ కార్యాలయానికి తీసుకెళ్లి చితకబాదారు. దాడి వీడియోలను పవన్‌ తండ్రికి పంపించారు. పవన్‌ ఇవ్వాల్సిన డబ్బులు కడతానని అతని తండ్రి చెప్పడంతో నిన్న మధ్యాహ్నం పవన్ ను వదిలేశారని డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. పవన్ పై దాడి చేసిన నిందితులపై కిడ్నాప్‌, హత్యాయత్నం కేసులు నమోదు చేశాం. ఈ కేసుకు సంబంధించి అనిల్ రెడ్డి, జగదీష్ లను అరెస్టు చేశామని, మరో నిందితుడు దినేష్ కోసం గాలిస్తున్నామని వివరించారు.


More Telugu News