: అమెరికా-భారత్ మధ్య పెరిగిన గ్యాప్... అవకాశాన్ని అనుకూలంగా మలుచుకునే దిశగా పాకిస్థాన్

  • ట్రంప్ సుంకాలతో అమెరికా, భారత్ మధ్య పెరిగిన గ్యాప్
  • తమ దేశ ప్రయోజనాలే ముఖ్యమంటున్న భారత్
  • ట్రంప్ తీరును తప్పుబడుతున్న సొంత పార్టీ నేతలు
  • అమెరికాతో బంధాలను బలోపేతం చేసుకునే దిశగా పాక్ అడుగులు
  • మరోసారి అమెరికాకు వెళుతున్న పాక్ ఆర్మీ చీఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అదనపు సుంకాలతో భారత్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నారు. మరోవైపు, ఆపరేషన్ సిందూర్ తర్వాత గత జూన్ లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా వైట్ హౌస్ లో మునీర్ కు గౌరవ మర్యాదలు లభించాయి. ఆ పర్యటన సందర్భంగా ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతికి మునీర్ మద్దతు ప్రకటించారు. తాజాగా మునీర్ మరోసారి అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న ఇండియాపై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. తొలుత సుంకాలను 25 శాతం పెంచిన ట్రంప్... భారత్ తన దారిలోకి రాకపోయేసరికి జరిమానాగా సుంకాలను మరో 25 శాతం పెంచారు. ఇదే సమయంలో పాకిస్థాన్ పై స్వల్ప సుంకాలను విధించారు. 

ఈ క్రమంలో అమెరికాతో భారత్ కు గ్యాప్ కొంత పెరిగింది. తమకు తమ దేశ ప్రయోజనాలే ప్రధానమని భారత్ స్పష్టం చేసింది. ట్రంప్ వ్యవహారశైలిపై భారత్ లో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ట్రంప్ పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా ఆయన తీరును తప్పుబడుతున్నారు. నమ్మకమైన మిత్రదేశం భారత్ తో కయ్యం వద్దని హితవు పలుకుతున్నారు.

మరోవైపు, ఇదే సమయంలో... అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి పాక్ ప్రయత్నిస్తోంది. భారత్, అమెరికా మధ్య కొంత మేర బలహీనపడ్డ బంధాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు కార్యాచరణ మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే జనరల్ మునీర్ మరోసారి అమెరికాకు వెళ్తున్నారు.

More Telugu News