Chandrababu Naidu: చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని

Perni Nani Criticizes Chandrababu Naidu on Pulivendula Election
  • చంద్రబాబుకి వయసు పెరిగే కొద్దీ సంకుచిత ఆలోచనా ధోరణి పెరిగిపోతోందన్న పేర్ని నాని
  • పులివెందులలో గెలిచి వాపును చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా
  • జగన్ అధికారంలోకి వస్తే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోవాలని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి వయసు పెరిగే కొద్దీ సంకుచిత ఆలోచనా ధోరణి పెరిగిపోతోందని ఆయన మండిపడ్డారు. ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని... అయితే, కేవలం పులివెందుల జడ్సీటీసీకి మాత్రమే బైఎలెక్షన్ పెట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పులివెందుల జెడ్పీటీసీకి నామినేషన్ వేశామని చెప్పారు. 

వైసీపీ నామినేషన్ వేసినప్పటి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రౌడీలను దించారని పేర్ని నాని దుయ్యబట్టారు. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను కేవలం సినిమాల్లోనే చూస్తుంటామని అన్నారు. కానీ, ఇప్పుడు చంద్రబాబు వాటిని అందరికీ నేర్పిస్తున్నారని చెప్పారు. బీసీ నేత అయిన వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, రాముపై దాడి చేయించారని మండిపడ్డారు. కత్తులు, రాడ్లతో పైశాచికంగా దాడి చేశారని, కార్లను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వస్తే మీకు ఎలాంటి గతి పడుతుందో మీరే ఆలోచించుకోవాలని హెచ్చరించారు. 

పులివెందులలో జరిగిన దాడి గురించి పోలీసులకు ముందే తెలుసని పేర్ని నాని ఆరోపించారు. సినిమా స్క్రిప్ట్ మాదిరి మొత్తం వ్యవహారం పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని అన్నారు. పులివెందులలో గెలిచామని తమ వాపును చూపించుకునే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క కేసు లేనివారిపై కూడా బైండోవర్లు పెట్టారని మండిపడ్డారు. ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని అన్నారు. జనాలను భయభ్రాంతులకు గురిచేసి గెలిచామని జబ్బలు చరుచుకోవద్దని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషనర్ మౌనంగా ఉంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ ను కోరామని చెప్పారు.
Chandrababu Naidu
Perni Nani
YS Jagan
Pulivendula
ZPTC election
Andhra Pradesh Politics
YSRCP
TDP
local body elections
political criticism

More Telugu News