: మనకు అమృతం దక్కొచ్చు: ట్రంప్ టారిఫ్ ల పెంపుపై ఆనంద్ మహీంద్రా

  • సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలన్న ఆనంద్ మహీంద్రా
  • దీనికోసం భారత్ రెండు బలమైన అడుగులు వేయాలని సూచన
  • ప్రపంచ పెట్టుబడులకు భారత్ తిరుగులేని వేదికగా అవతరించాలన్న మహీంద్రా
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంగా భారత్ పై సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతానికి పెంచారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ట్రంప్ నుంచి టారిఫ్ ల రూపంలో ఎదురైన సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలని ఆనంద్ మహీంద్రా అన్నారు. దీని కోసం భారత్ రెండు బలమైన అడుగులు వేస్తే... సుంకాల మథనంలో మనకు అమృతం దక్కే అవకాశం ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

ట్రంప్ ప్రారంభించిన సుంకాల యుద్ధం కారణంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నట్టు కనిపిస్తోందని ఆనంద్ మహీంద్రా అన్నారు. జర్మనీ, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలు ట్రంప్ సుంకాల విధింపుతో సొంత వ్యూహాలకు పదును పెట్టాయని చెప్పారు. దీని ఫలితంగా ప్రపంచ అభివృద్ధికి కొత్త ఇంజిన్లు లభిస్తున్నాయని అన్నారు. భారత్ కూడా ఈ సంక్లిష్ట క్షణాలను అవకాశంగా మలుచుకోవాలని చెప్పారు. 

1991లో మన దేశంలో నెలకొన్న విదేశీ మారక నిల్వల సంక్షోభంతో లిబరలైజేషన్ కు నాంది పడిందని తెలిపారు. ఇప్పటి పరిస్థితుల నుంచి అమృతం దక్కించుకోవడానికి భారత్ రెండు అడుగులు వేయాల్సి ఉందని చెప్పారు. 

ప్రపంచ పెట్టుబడులకు తిరుగులేని వేదికగా భారత్ అవతరించాలని సూచించారు. దీని కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని వేగంగా మెరుగుపరచాలని అన్నారు. విదేశీ మారక నిల్వలను పెంచుకునేందుకు పర్యాటక రంగాన్ని శక్తిగా మలుచుకోవాలని చెప్పారు. టూరిజం వల్ల ఉపాధి కూడా పెరుగుతుందని అన్నారు. తయారీ రంగంపై దిగుమతి సుంకాలను క్రమబద్ధీకరించాలని సూచించారు.

More Telugu News