Nandamuri Balakrishna: సినీ కార్మికుల సమస్యలు... బాలకృష్ణను కలిసిన నిర్మాతలు!

Nandamuri Balakrishna Meets Producers Regarding Film Workers Issues
  • అగ్ర హీరోలతో వరుస భేటీలు జరుపుతున్న నిర్మాతల బృందం
  • సినీ కార్మికుల వేతనాల పెంపు సమస్యపై చర్చలు జరుపుతున్న నిర్మాతలు
  • బాలకృష్ణ కీలక సూచనలు చేశారన్న నిర్మాత ప్రసన్నకుమార్
సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిర్మాతల బృందం అగ్ర హీరోలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. మొన్న మెగాస్టార్ చిరంజీవితో సమావేశమై సినీ కార్మికుల సమస్యల గురించి చర్చించిన నిర్మాతల బృందం, నిన్న మరో అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణతో భేటీ అయింది.

సినీ కార్మికుల వేతనాల పెంపు వ్యవహారం ప్రస్తుతం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలకృష్ణతో నిర్మాతల బృందం విస్తృతంగా చర్చించింది. ఈ సమావేశంలో ఫెడరేషన్‌తో జరుగుతున్న చర్చలు, కార్మికుల సంక్షేమం గురించి కీలక అంశాలు చర్చించినట్లు సమాచారం.

బాలకృష్ణతో సమావేశం అనంతరం నిర్మాత ప్రసన్నకుమార్ పలు ముఖ్యమైన వివరాలను మీడియాతో పంచుకున్నారు. పరిశ్రమలో నిర్మాతలు బాగుంటేనే అందరూ బాగుంటారని బాలకృష్ణ అభిప్రాయపడ్డారని ప్రసన్నకుమార్ తెలిపారు. సినీ పరిశ్రమ ఆర్థిక ఆరోగ్యం నిర్మాతల స్థిరత్వంపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ షూటింగ్ ఖర్చులను తగ్గించేందుకు పలు సూచనలు చేశారన్నారు. పని దినాలను తగ్గించుకోవడంతో పాటు షూటింగ్‌లో అవసరమైనంత మేరకే సిబ్బందిని తీసుకోవాలని బాలకృష్ణ సలహా ఇచ్చారన్నారు.

తాను ఏడాదికి నాలుగు సినిమాలకు మాత్రమే పని చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బాలకృష్ణ వెల్లడించారని, దీనివల్ల నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ, ఒత్తిడిని తగ్గించవచ్చని ఆయన తెలిపారన్నారు. అందరికీ మంచి జరిగేలా నిర్ణయం తీసుకుందామని బాలకృష్ణ సూచించారన్నారు. త్వరలోనే సమస్యలకు పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారని ప్రసన్నకుమార్ తెలిపారు. 
Nandamuri Balakrishna
Balakrishna
Telugu cinema
Tollywood
Film industry
Movie workers
Film producers
Chiranjeevi
Movie production costs
Telugu movies

More Telugu News