WhatsApp: వాట్సాప్ లో 'సేఫ్టీ ఓవర్ వ్యూ'... ఏమిటీ కొత్త ఫీచర్?

WhatsApp Introduces Safety Overview Feature to Combat Group Scams
  • వాట్సప్‌లో యూజర్ల భద్రత కోసం ‘సేఫ్టీ ఓవర్‌వ్యూ’ ఫీచర్
  • తెలియని గ్రూప్‌లో చేర్చితే పూర్తి వివరాలు మీ చేతికి
  • గ్రూప్‌ను ఎవరు క్రియేట్ చేశారు, ఎవరు యాడ్ చేశారనే సమాచారం
  • స్కామ్‌లు, ఫిషింగ్ మోసాల నుంచి వినియోగదారులకు రక్షణ
  • మోసపూరిత కార్యకలాపాలపై ఇప్పటికే 68 లక్షల ఖాతాలపై వేటు
  • త్వరలో తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు హెచ్చరిక
మీకు సంబంధం లేకుండానే ఎవరో తెలియని వ్యక్తులు మిమ్మల్ని వాట్సప్ గ్రూపుల్లో చేర్చేస్తున్నారా? స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ అంటూ వచ్చే స్పామ్ మెసేజ్‌లతో విసిగిపోయారా? అయితే వాట్సప్ యూజర్లకు ఇది శుభవార్తే. వినియోగదారుల భద్రత, ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని వాట్సప్ ఓ కీలకమైన కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మోసపూరిత గ్రూపుల నుంచి వినియోగదారులను రక్షించడమే ఈ ఫీచర్ ముఖ్య ఉద్దేశం.

‘సేఫ్టీ ఓవర్‌వ్యూ’ పేరుతో పరిచయం చేసిన ఈ ఫీచర్, తెలియని గ్రూపుల విషయంలో పూర్తి నియంత్రణను వినియోగదారుడి చేతికే అందిస్తుంది. ఇకపై ఎవరైనా మిమ్మల్ని ఓ కొత్త గ్రూప్‌లో యాడ్ చేస్తే, వెంటనే ఆ గ్రూప్‌ పూర్తి వివరాలు మీకు కనిపిస్తాయి. ఆ గ్రూప్‌ను ఎవరు సృష్టించారు, మిమ్మల్ని ఎవరు చేర్చారు, అందులో ఎంతమంది సభ్యులున్నారు, ఎప్పుడు క్రియేట్ చేశారు వంటి కీలక సమాచారాన్ని మీరు ముందే తెలుసుకోవచ్చు. అవసరమైతే, ఆ గ్రూప్‌లో గతంలో జరిగిన చాటింగ్‌ను కూడా చూసే అవకాశం ఉంటుంది.

ఈ వివరాలను పరిశీలించిన తర్వాత, ఆ గ్రూప్‌లో చేరాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా మీదే. ఒకవేళ గ్రూప్ నమ్మదగినది కాదనిపిస్తే, అందులోని మెసేజ్‌లను చూడకుండానే సులభంగా ఎగ్జిట్ కావచ్చు. గ్రూప్‌లో కొనసాగాలనుకుంటే, చెక్‌మార్క్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు నిర్ణయం తీసుకునేంత వరకు ఆ గ్రూప్ నోటిఫికేషన్లు కూడా మ్యూట్‌లో ఉంటాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ టిప్స్, క్రిప్టో పెట్టుబడుల పేరుతో జరిగే ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడంలో ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుందని వాట్సప్ భావిస్తోంది.

ఇదిలా ఉండగా, స్కామ్‌లను అరికట్టే చర్యల్లో భాగంగా వాట్సప్ ఇప్పటికే సుమారు 68 లక్షల ఫేక్ ఖాతాలను నిషేధించినట్లు తెలిపింది. దీంతో పాటు, త్వరలోనే మరో కొత్త భద్రతా ఫీచర్‌ను కూడా తీసుకురానుంది. దీని ద్వారా మీ కాంటాక్ట్ లిస్టులో లేని నంబర్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు, ఆ వ్యక్తికి సంబంధించిన అదనపు వివరాలతో కూడిన హెచ్చరిక కనిపిస్తుంది. ఇది మోసాల బారిన పడకుండా వినియోగదారులను మరింత అప్రమత్తం చేస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
WhatsApp
WhatsApp Safety Overview
WhatsApp new feature
online scams
fake accounts
privacy
data protection
cyber security
spam messages
group invite

More Telugu News