Kailash Yatra: కైలాస్ యాత్ర మార్గంలో చిక్కుకున్న యాత్రికులు.. 413 మందిని రక్షించిన ఐటీబీపీ సిబ్బంది

ITBP Rescues 413 Kailash Yatra Pilgrims Stranded in Kinnaur Floods
  • హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఆకస్మిక వరదలు
  • కిన్నౌర్ జిల్లాలో కైలాస్ యాత్ర ట్రెక్కింగ్ మార్గంలో చిక్కుకున్న యాత్రికులు
  • గంగానది నీటిమట్టం పెరుగుతుందన్న వాతావరణ శాఖ
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో బీభత్సం సృష్టిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో భారీ వరదల కారణంగా కైలాస్ యాత్ర ట్రెక్కింగ్ మార్గంలో వందలాది మంది యాత్రికులు వరదల్లో చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన ఐటీబీపీ సిబ్బంది 413 మందిని రక్షించారు. సహాయక చర్యల్లో 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. ట్రెక్కింగ్ మార్గాలు ధ్వంసం కావడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కిన్నౌర్ కైలాస్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 

మరోవైపు, హరిద్వార్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గంగానది నీటిమట్టం పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు ఘాట్ లకు దూరంగా ఉండాలని సూచించింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. 

ఇంకోవైపు, ఉత్తరాఖండ్ లోని ఖీర్ గంగానది పరివాహకప్రాంతంలో నిన్న జలప్రవాహం విరుచుకుపడటంతో సగం గ్రామం కొట్టుకుపోయింది. మరోవైపు, ఉత్తరాఖండ్ లోని హర్ కి పౌరి-భీమ్ గోడా రహదారిపై కొండపై నుంచి బండ రాళ్లు అకస్మాత్తుగా పడ్డాయి. ఈ సమయంలో అక్కడ బైక్ పై వెళుతున్న ముగ్గురు యువకులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Kailash Yatra
Kinnaur
Himachal Pradesh floods
ITBP rescue
Uttarakhand floods
NDRF
Heavy rainfall
Trekking route
Haridwar
River Ganga

More Telugu News