Mukesh Parmar: భర్తను కొట్టి చంపి కొడుకు ముందే ఉరేసుకున్న భార్య.. అహ్మదాబాద్ లో ఘోరం

Ahmedabad Crime Wife Murders Constable Husband Over Affair Then Suicide
  • మరో మహిళతో భర్తకు అక్రమ సంబంధం
  • తనను మానసికంగా, శారీరకంగా వేధించాడంటూ సూసైడ్ లేఖ
  • రక్తపు మడుగులో తండ్రి, ఎంతకూ తలుపు తెరవని తల్లి.. పక్కింటి వాళ్లను అలర్ట్ చేసిన కొడుకు
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధం ఓ కానిస్టేబుల్ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. తోటి కానిస్టేబుల్ తో బంధాన్ని వదులుకోవాలని ఎంత చెప్పినా భర్త వినడంలేదనే కోపంతో భార్య విచక్షణ మరిచింది. కర్రతో తలపై కొట్టడంతో భర్త అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో తన గదిలోకి వెళ్లిన భార్య.. లెటర్ రాసి ఉరి వేసుకుని చనిపోయింది. ఇదంతా జరుగుతుండగా వారి ఎనిమిదేళ్ల కొడుకు కూడా ఇంట్లోనే ఉన్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్ కోట్ కు చెందిన ముకేశ్ పార్మర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ లో తనతో పాటు విధులు నిర్వహించే లేడీ కానిస్టేబుల్ తో ముకేశ్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ముకేశ్ భార్య సంగీతకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం కూడా భార్యాభర్తలు ఇద్దరూ గొడవపడ్డారు. ఆ సమయంలో వారి ఎనిమిదేళ్ల కొడుకు ఇంట్లోనే ఉన్నాడు. అమ్మానాన్నల గొడవచూసి భయంతో వణికిపోయాడు.

గొడవ ముదరడంతో కోపం పట్టలేక సంగీత ఓ కర్రతో ముకేశ్ తలపై కొట్టింది. దీంతో ముకేశ్ అక్కడికక్కడే కుప్పకూలి ఊపిరి వదిలాడు. ఆ తర్వాత సంగీత తన గదిలోకి వెళ్లి లేఖ రాసి చీరతో ఉరి వేసుకుంది. కాసేపటికి సంగీత కూడా ప్రాణం వదిలింది. ఓవైపు రక్తపు మడుగులో పడి ఉన్న తండ్రి, మరోవైపు గదిలో నుంచి ఎంతకూ బయటకు రాని తల్లిని చూసి తీవ్ర భయాందోళనకు గురైన బాలుడు ఇరుగుపొరుగు వారిని పిలిచాడు.

వారు వచ్చి ముకేశ్ చనిపోయిన విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి బలవంతంగా తలుపులు తెరవగా.. ఉరికి వేలాడుతున్న సంగీత కనిపించింది. వెంటనే కిందకు దించి పరీక్షించగా అప్పటికే మరణించిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. బాలుడు ప్రస్తుతం బంధువుల సంరక్షణలో ఉన్నాడని తెలిపారు.
Mukesh Parmar
Ahmedabad
Gujarat
police constable
extra marital affair
murder suicide
domestic violence
crime news
Rajkot

More Telugu News