Sachin Tendulkar: షేక్‌హ్యాండ్ వివాదం: అదో పెద్ద డ్రామా.. బెన్ స్టోక్స్ తీరును ఏకిపారేసిన సచిన్

Sachin Tendulkar Tears Into Ben Stokes Over Handshake Drama
  • మాంచెస్టర్ టెస్టులో ‘షేక్‌హ్యాండ్ డ్రామా’పై స్పందించిన సచిన్ టెండూల్కర్
  • ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీరును తీవ్రంగా విమర్శించిన క్రికెట్ దిగ్గజం
  • మీ బౌలర్లకు విశ్రాంతినివ్వడానికి మేమెందుకు షేక్‌హ్యాండ్ ఇవ్వాలని సూటి ప్రశ్న
  • సెంచరీల కోసం ఆడిన జడేజా, సుందర్‌ల నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించిన సచిన్
  • భారత ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించలేదని స్పష్టీకరణ
ఇంగ్లండ్‌తో జరిగిన మాంచెస్టర్ టెస్టులో చోటుచేసుకున్న ‘షేక్‌హ్యాండ్ వివాదం’పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తీవ్రంగా స్పందించాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీరును తప్పుబడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు విశ్రాంతినివ్వడం కోసం భారత ఆటగాళ్లు తమ వ్యక్తిగత మైలురాళ్లను ఎందుకు వదులుకోవాలని మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌ సూటిగా ప్రశ్నించాడు.

2025 అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన నాలుగో టెస్టు చివరి రోజున ఈ వివాదం మొదలైంది. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలకు చేరువలో ఉన్న సమయంలో మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే, జడేజా, సుందర్ ఆ ప్రతిపాదనను తిరస్కరించి బ్యాటింగ్ కొనసాగించారు. తమ సెంచరీలు పూర్తిచేయడంతో పాటు జట్టును ఓటమి నుంచి తప్పించి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు.

ఈ ఘటనపై క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చే జరిగింది. భారత ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారంటూ కొందరు విమర్శించగా, మరికొందరు వారి నిర్ణయాన్ని సమర్థించారు. ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ భారత ఆటగాళ్లకు పూర్తి మద్దతుగా నిలిచాడు. "మీ బౌలర్లకు విశ్రాంతినివ్వడం కోసం మేమెందుకు షేక్‌హ్యాండ్ ఇవ్వాలి?" అని ఆయన ప్రశ్నించాడు. భారత బ్యాటర్లు ఎంతో కష్టపడి, ప్రత్యర్థి బౌలర్ల దూకుడును తట్టుకుని క్రీజులో నిలిచారని, అలాంటి సమయంలో సెంచరీలు పూర్తి చేసుకునే హక్కు వారికి ఉందని సచిన్ స్పష్టం చేశాడు.

సచిన్ వ్యాఖ్యలకు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ కూడా మద్దతు పలికాడు. "వాళ్లను ఔట్ చేయండి. సెంచరీలు చేయనివ్వకండి" అంటూ ఇంగ్లండ్‌కే చురకలంటించాడు. విజయం సాధించాలంటే ప్రత్యర్థిని ఔట్ చేయాలి తప్ప, ఇలాంటి రాయితీలు ఆశించకూడదని ఆయన అభిప్రాయపడ్డాడు.

ఇక‌, అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ సిరీస్ చివరికి 2-2తో సమంగా ముగిసిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ షేక్‌హ్యాండ్ వివాదం మాత్రం సిరీస్‌లో ఒక ప్రధాన చర్చనీయాంశంగా నిలిచిపోయింది.
Sachin Tendulkar
Ben Stokes
India vs England
Manchester Test
Ravindra Jadeja
Washington Sundar
Nathan Lyon
Shakehand Controversy
Cricket
2025 Anderson Tendulkar Trophy

More Telugu News