Shanmugavel: తండ్రీకొడుకుల గొడవను ఆపేందుకు వెళ్లిన ఎస్సై.. అందరూ కలిసి వెంటాడి నరికి చంపేశారు!

Tamil Nadu Police Officer Shanmugavel Killed in Tiruppur Dispute
  • తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఘటన
  • ఫోన్‌కాల్ రావడంతో వెళ్లిన ఎస్ఎస్సై
  • గాయపడిన తండ్రిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా కొడవలితో వెనకనుండి చిన్నకుమారుడి దాడి
  • ఆపై తండ్రీ కుమారులు ఒక్కటై విచక్షణ రహితంగా దాడి
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో దారుణం జరిగింది. తండ్రీ కుమారుల మధ్య గొడవను ఆపేందుకు వెళ్లిన సబ్ ఇన్‌స్పెక్టర్ ను వారు దారుణంగా నరికి చంపారు. ఉడుమల్‌పేట సమీపంలోని కుడిమంగళం గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.  పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. రాత్రి గస్తీలో ఉన్న ప్రత్యేక సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఎస్సై) షణ్ముగవేల్‌కు అత్యవసర కాల్ ఒకటి వచ్చింది. దీంతో వెంటనే ఆయన ఘటనా స్థలానికి వెళ్లారు. 

స్థానిక అన్నాడీఎంకే ఎమ్మెల్యేకు చెందిన ఒక ప్రైవేట్ ఎస్టేట్‌లో పనిచేసే మూర్తి, ఆయన ఇద్దరు కుమారులు తంగపాండియన్, మణికందన్ మధ్య తీవ్ర వాగ్వివాదం జరుగుతోంది. కొడుకులిద్దరూ కలిసి తండ్రిపై దాడి చేయడంతో షణ్ముగవేల్ జోక్యం చేసుకుని, గాయపడిన మూర్తిని ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్‌ను పిలిపించారు.

ఈ క్రమంలో పెద్ద కొడుకు తంగపాండియన్‌తో షణ్ముగవేల్ మాట్లాడుతుండగా, చిన్న కొడుకు మణికందన్ కొడవలితో ఆయనపై దాడి చేశాడు. ఆ తర్వాత తండ్రి, పెద్ద కొడుకు కూడా ఆ దాడిలో పాల్గొన్నారు. పోలీస్ అధికారిని వెంబడించి నరికి చంపారు. షణ్ముగవేల్ డ్రైవర్ తప్పించుకుని అధికారులకు సమాచారం అందించాడు. ఈ ఘటనలో నిందితులైన ముగ్గురూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.

ఈ హత్యపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే, రూ. 30 లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో అర్హత గల వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు.  
Shanmugavel
Tamil Nadu
Tiruppur
Sub Inspector Murder
Udumalpet
Father Son Dispute
Police Officer Killed
MK Stalin
ANNA DMK

More Telugu News