Tej Pratap Yadav: నన్ను ఎగతాళి చేసిన వారు గాలిలో తేలిపోతారు.. తేజ్ ప్రతాప్ యాదవ్ హెచ్చరిక

Tej Pratap Yadav Warns Rivals Will Float in Air
  • బీహార్ ఎన్నికల వేళ ఐదు పార్టీలతో కొత్త కూటమి ఏర్పాటు
  • ఆర్జేడీ, కాంగ్రెస్‌లకు తేజ్ ప్రతాప్ ఆహ్వానం
  • ప్రజలు తనను ఎగతాళి చేసినా తన దారిలోనే తాను నడుస్తానని ప్రకటన
బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ సంవత్సరం చివరిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఐదు చిన్న పార్టీలతో కలిసి కొత్త కూటమిని ఏర్పాటు చేస్తున్నట్టు నిన్న ప్రకటించారు. తనను ఎగతాళి చేసేవారు ‘గాలిలో తేలిపోతారని’హెచ్చరించిన ఆయన ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను తమ కూటమిలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఈ కూటమిలో భాగమైన పార్టీల జాతీయ అధ్యక్షులు కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. తేజ్ ప్రతాప్ కూటమిలో వికాస్ వంచిత్ ఇన్సాన్ పార్టీ (వీవీఐపీ), భోజ్‌పురియా జన్ మోర్చా (బీజేఎం), ప్రగతిశీల్ జనతా పార్టీ (పీజేపీ), వాజిబ్ అధికార పార్టీ (డబ్ల్యూఏపీ), సంయుక్త్ కిసాన్ వికాస్ పార్టీ (ఎస్‌కేవీపీ) ఉన్నాయి.

"ప్రజలు నన్ను ఎగతాళి చేయవచ్చు, కానీ నేను నా దారిలోనే వెళ్తాను. సామాజిక న్యాయం, సామాజిక హక్కులు, బీహార్ సంపూర్ణ పరివర్తన కోసం మా కూటమి కలిసి ముందుకు సాగుతుంది. ప్రజలు మాకు అధికారం ఇస్తే రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తాం. రామ్ మనోహర్ లోహియా, కర్పూరి ఠాకూర్, జయప్రకాశ్ నారాయణ్ కలలను నెరవేర్చడానికి మేము కృషి చేస్తాం" అని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు.

ఆర్జేడీ నుంచి ఇటీవలే బహిష్కరణకు గురైన తేజ్ ప్రతాప్ తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన మహువా స్థానం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. "ప్రజలు నాకు మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు నా 'టీమ్ తేజ్ ప్రతాప్ యాదవ్' అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానమయ్యారు" అని ఆయన చెప్పారు. తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్టు ఆయన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ మే 25న ప్రకటించారు. అనుష్క అనే మహిళతో సంబంధం ఉన్నట్టు తేజ్ ప్రతాప్ అంగీకరించిన తర్వాత ఆయన పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.  
Tej Pratap Yadav
Bihar elections
RJD
political alliance
Bihar politics
Lalu Prasad Yadav
Mahua constituency
social justice
political coalition
Vikas Vanchit Insaan Party

More Telugu News