Edward Corristine: ‘డోజ్’ మాజీ ఉద్యోగిపై వాషింగ్టన్‌లో దారుణ దాడి.. స్పందించిన ట్రంప్, మస్క్

Washington DC Attack on Edward Corristine Prompts Response from Trump Musk
  • కోరిస్టీన్, ఆయన సహచరిపై టీనేజర్ల దాడి
  • కార్‌ జాకింగ్‌ను అడ్డుకున్నందుకు దారుణంగా దాడిచేసిన కుర్రాళ్లు
  • పెట్రోలింగ్ పోలీసులు రావడంతో పారిపోయిన వైనం
  • వాషింగ్టన్ డీసీలో నేరాలు నియంత్రణలో లేవన్న ట్రంప్
  • గతంలోనూ మహిళపై కొందరు దాడిచేశారన్న మస్క్
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ కోరిస్టీన్‌పై జరిగిన దాడి కలకల రేపింది.  ఈ ఘటనకు సంబంధించి 15 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురను పోలీసులు అరెస్ట్ చేశారు. 

 కోరిస్టీన్ అలియాస్ ‘బిగ్ బాల్స్’ డోజ్‌లో గుర్తింపు పొందారు.  ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నగరంలోని లోగాన్ సర్కిల్ పరిసరాల్లో కొరిస్టీన్, ఆయన సహచరిపై దాడి జరిగింది. కొందరు టీనేజర్లు వారి కారును దొంగిలించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో కోరిస్టీన్ తన సహచరిని కారులోకి నెట్టి వారిని ఎదుర్కొన్నారు. దీంతో వారు ఆయనపై దాడికి పాల్పడ్డారు. సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు జోక్యం చేసుకోవడంతో దుండగులు పారిపోయారు.

మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ మేరీల్యాండ్‌కు చెందిన ఇద్దరు 15 ఏళ్ల టీనేజర్లను కార్‌జాకింగ్ ఆరోపణలపై అరెస్టు చేసింది. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ ‘‘డీసీ దీనిని త్వరగా సరిదిద్దుకోకపోతే నగరాలను ఫెడరల్ నియంత్రణలోకి తీసుకోవాల్సి వస్తుంది’’అని పోస్ట్ చేశారు. వాషింగ్టన్‌లో నేరాలు నియంత్రణలో లేవని ట్రంప్ ఆవేదన వ్యక్తంచేశారు. వాషింగ్టన్ డీసీకి రాష్ట్ర హోదా లేకపోవడంతో ఫెడరల్ పర్యవేక్షణ కొరవడుతోంది. ఫలితంగా నేరాలు పెచ్చుమీరుతున్నాయని చెబుతున్నారు.

ఇక్కడ నేరాలు, ముఖ్యంగా కార్‌జాకింగ్‌లు తీవ్రమైన సమస్యగా ఉన్నాయని స్థానిక అధికారులు అంగీకరించారు. గతేడాది కూడా 14 ఏళ్ల కుర్రాడు కార్‌జాకింగ్‌లో ఒక లిఫ్ట్ డ్రైవర్‌ను చంపినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ దాడిపై దర్యాప్తు కొనసాగుతోందని, మరికొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

వాషింగ్టన్ డీసీలో కొన్ని రోజుల క్రితం రాత్రివేళ దాదాపు డజను మంది యువకులు కారులో ఉన్న మహిళపై దాడికి ప్రయత్నించారని ఎలాన్ మస్క్ గుర్తు చేసుకున్నారు. అది చూసిన డోజ్ టీం సభ్యుడు ఒకరు పరిగెత్తుకెళ్లి మహిళను రక్షించే ప్రయత్నం చేశాడని చెప్పారు. ఈ క్రమంలో అతడు కూడా దెబ్బలు తిన్నప్పటికీ మహిళను రక్షించినట్టు మస్క్ గుర్తు చేసుకున్నారు.
Edward Corristine
Washington DC crime
Doz employee attack
carjacking Washington
Donald Trump
Elon Musk
federal oversight
Logan Circle
crime rates
car theft

More Telugu News