Rishabh Pant: రిషబ్ పంత్ గొప్ప మనసు... చదువు ఆగిపోతుందన్న బాధలో ఉన్న యువతికి అండ

Cricketer Rishabh Pant helps Karnataka girl student with college fee wins hearts
  • కర్ణాటకకు చెందిన నిరుపేద విద్యార్థినికి పంత్ ఆర్థిక సాయం
  • ఆర్థిక ఇబ్బందులతో యువతి ఉన్నత చదువుకు అడ్డంకి
  • కాలేజీ ఫీజు రూ. 40 వేలు నేరుగా చెల్లించిన పంత్
  • టీ కొట్టు యజమాని కూతురిని ఆదుకున్న వైనం
  • పంత్ మంచి మనసుపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు
టీమిండియా స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మైదానంలో తన దూకుడైన ఆటతోనే కాదు, మైదానం బయట తన ఉదార స్వభావంతోనూ అందరి మనసులను గెలుచుకున్నాడు. కర్ణాటకకు చెందిన ఓ నిరుపేద విద్యార్థిని ఉన్నత చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుగా నిలవడంతో, ఆయన స్వయంగా ముందుకు వచ్చి కాలేజీ ఫీజు చెల్లించి అండగా నిలిచాడు. ఈ మానవతా దృక్పథంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లా, రబ్కవి గ్రామానికి చెందిన జ్యోతి కనబుర్ మఠ్ అనే విద్యార్థిని 12వ తరగతి (పీయూసీ) పరీక్షల్లో 85 శాతం మార్కులు సాధించింది. జమ్ఖండిలోని బీఎల్‌డీఈ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) చదవాలని ఆశపడింది. అయితే, ఆమె తండ్రి ఓ చిన్న టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కాలేజీలో చేరేందుకు అవసరమైన రూ. 40 వేల ఫీజును కట్టలేని దుస్థితి వారిది. దీంతో ప్రతిభ ఉన్నా జ్యోతి చదువు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక కాంట్రాక్టర్ అనిల్ హునశికట్టి, తనకు తెలిసిన క్రికెట్ వర్గాల ద్వారా సాయం కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో జ్యోతి దీనస్థితి, చదువు పట్ల ఆమెకున్న పట్టుదల గురించి రిషబ్ పంత్‌కు తెలిసింది. విషయం తెలియగానే ఆయన తక్షణమే స్పందించారు. జులై 17న జ్యోతి కాలేజీ ఫీజు రూ. 40 వేలను నేరుగా విద్యాసంస్థకే ఆన్‌లైన్‌లో బదిలీ చేశారు.

పంత్ చేసిన ఈ ఆకస్మిక సహాయంతో జ్యోతి కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పేదరికం కారణంగా తన చదువు ఆగిపోకుండా ఆదుకున్న రిషబ్ పంత్‌కు జ్యోతి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. కష్టకాలంలో ఆదుకుని తన కలను నిలబెట్టిన పంత్ మంచి మనసును క్రికెట్ అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా అభినందిస్తున్నారు. విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ఓ యువతి భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన పంత్ రియల్ హీరో అని సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు.
Rishabh Pant
Rishabh Pant donation
Jyoti Kanabur Math
Karnataka student
student education
cricket
BCA college fee
Bagalkot district
BLDE college
Rishabh Pant help

More Telugu News