Chandrababu Naidu: కొందరికి డబ్బున్నా పేదలను ఆదుకునేందుకు మనసు రాదు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu on P4 Program for Poverty Eradication
  • ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలనకు పీ-4 కార్యక్రమం
  • ఈ నెల 19 నుంచి అమలు చేయనున్నట్లు సీఎం వెల్లడి
  • పేద కుటుంబాలకు చేయూతనివ్వనున్న 'మార్గదర్శులు'
  • తాను 250 కుటుంబాలను దత్తత తీసుకున్నానన్న చంద్రబాబు
  • కార్యక్రమంలో బిల్ గేట్స్, వేదాంత వంటి సంస్థల భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలనకు చేపట్టిన పీ-4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్‌షిప్) కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యమని, ఈ కార్యక్రమం ఈ నెల 19 నుంచి అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సచివాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్ష నిర్వహించారు.

సీఎం మాట్లాడుతూ, మార్గదర్శుల ఎంపికలో ఎవరినీ బలవంతం చేయకుండా స్వచ్ఛందంగా జరగాలని సూచించారు. "మార్గదర్శుల చిన్న సాయం పేదలకు కొండంత అండగా ఉంటుంది. బంగారు కుటుంబాలకు భావోద్వేగ బంధం, చేయూత అవసరం" అని పేర్కొన్నారు. సీఎస్‌ఆర్ నిధులతో బిల్ గేట్స్, వేదాంత వంటి సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయని, ప్రజల ఆస్తిగా ‘జీరో పావర్టీ మిషన్’ అమలు చేస్తున్నామని చెప్పారు.

ఇప్పటివరకు 9,37,913 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు, 1,03,938 మందిని మార్గదర్శులుగా ఎంపిక చేసినట్లు సీఎం తెలిపారు. 10 లక్షల కుటుంబాల అవసరాలను 11 ప్రశ్నల ద్వారా ఏఐ సాయంతో విశ్లేషించగా, 31% మంది ఉద్యోగ అవకాశాలు, 22% మంది వైద్య చికిత్స, 9% మంది చిన్న వ్యాపారాల విస్తరణకు సాయం కోరినట్లు వెల్లడించారు. గ్రామాలు, మండలాల వారీగా దత్తత కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు ముందుకొస్తున్నారని, తాను 250 కుటుంబాలను దత్తత తీసుకున్నానని, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చంద్రబాబు వివరించారు.

కొందరు మంచి పనులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంటారని అన్నారు. మరికొందరు డబ్బు ఉన్నా పేదలను ఆదుకునేందుకు మనసు రాదని అన్నారు. ఇంకొందరికి మనసు ఉన్నా సేవా కార్యక్రమాలు చేసేందుకు తగిన సమయం ఉండదని చంద్రబాబు పేర్కొన్నారు. అటువంటి వారిని గుర్తించి మార్గదర్శనం చేయాలని అధికారులకు సూచించారు. నేడు బంగారు కుటుంబంలో సాయం పొందిన వారే రేపు మార్గదర్శి అవ్వొచ్చని అన్నారు.
Chandrababu Naidu
P4 program
Andhra Pradesh
poverty eradication
zero poverty mission
bangarru kutumbalu
CSR funds
Bill Gates
Vedanta
मार्गदर्शक

More Telugu News