సెటప్ అదిరింది... ప్రసిద్ధ్ కృష్ణపై కావ్యా పాప ప్రశంసలు!

  • ఓవల్ టెస్టులో టీమిండియా చారిత్రక విజయం
  • రెండు ఇన్నింగ్స్ ల్లో 8 వికెట్లతో రాణించిన ప్రసిద్ధ్ కృష్ణ 
  • రెండో ఇన్నింగ్స్ లో జోష్ టంగ్ ను అవుట్ చేసిన తీరు అదుర్స్
  • వీడియో పంచుకున్న కావ్యా మారన్
ఓవల్ టెస్టులో టీమిండియా గెలిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. ఓటమి ఖాయమనున్న దశ నుంచి ఆతిథ్య ఇంగ్లండ్ మెడలు వంచిన తీరు మేటి క్రికెట్ పండితులను సైతం విస్మయానికి గురిచేసింది. దాంతో టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ తో పాటు రాణించిన మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ. ఓవల్ టెస్టులో ప్రసిద్ధ్ రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 8 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. 

అయితే, రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బ్యాటర్ జోష్ టంగ్ ను డకౌట్ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే... తాను అవుట్ స్వింగర్ వేయబోతున్నానంటూ కెప్టెన్ గిల్ కు సంజ్ఞలు చేసిన ప్రసిద్ధ్ అందుకు అనుగుణంగానే ఫీల్డింగ్ మోహరింపులు చేశాడు. థర్డ్ మ్యాన్ ను బాగా వెనక్కి పంపించి నిజంగానే అవుట్  స్వింగర్ వేస్తాడేమో అనేలా భ్రమింపజేశాడు. ఈ తరహా ఫీల్డింగ్ సెట్టింగ్ చూస్తే ఎవరైనా సరే, బౌలర్ అవుట్ స్వింగర్ వేస్తాడనే అనుకుంటారు. కానీ, ప్రసిద్ధ్ కృష్ణ మాత్రం సర్రున దూసుకుపోయేలా ఓ ఇన్ స్వింగర్ విసరడంతో జోష్ టంగ్ తత్తరపాటుకు గురై క్లీన్ బౌల్డయ్యాడు. ఊహించని విధంగా లోపలికి స్వింగ్ అయిన ఆ బంతి వికెట్లను గిరాటేసింది.

దీనిపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ  యజమానురాలు కావ్యా మారన్ సోషల్ మీడియాలో స్పందించారు. సెటప్ అదిరింది... ఇంగ్లండ్ బ్యాటర్ ను ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగాఏమార్చాడు... నిజంగా బుర్ర ఉపయోగించి బంతిని విసిరాడు.. జీనియస్ అంటూ ప్రసిద్ధ్ కృష్ణపై ఆమె పొగడ్తల జల్లు కురిపించారు. ప్రసిద్ధ్ కృష్ణ విసిరిన ఆ బంతికి సంబంధించిన వీడియోను కూడా కావ్యా పంచుకున్నారు.  


More Telugu News