Ashwini Vaishnaw: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. వందేభారత్ తొలి స్లీపర్ రైలు పరుగులు ఎప్పుడు? ఎక్కడి నుంచంటే..!

Vande Bharat Sleeper Train to Launch in September Says Railway Minister Ashwini Vaishnaw
  • వచ్చే నెల నుంచే వందేభారత్ స్లీపర్ తొలి రైలు ట్రాక్‌పైకి
  • రూట్లలో ఢిల్లీ-సికింద్రాబాద్ కూడా
  • త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్న రైల్వే
  • పునర్నిర్మాణంలో 1300 స్టేషన్లు
రైల్వే ప్రయాణికులకు ఇది శుభవార్తే. సెప్టెంబర్‌లో వందేభారత్ తొలి స్లీపర్ రైలు ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ కొత్త రైలు భారత రైల్వేలో విప్లవాత్మక మార్పులను తీసుకురానుందని చెప్పారు. అలాగే ముంబై-అహ్మదాబాద్ మధ్య దేశంలోని మొదటి బుల్లెట్ రైలు సేవలు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. ఇది 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల 7 నిమిషాల్లో చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

వందే భారత్ స్లీపర్ రైలు అంటే ఏమిటి, ఇది ఎందుకు ప్రత్యేకం?
వందే భారత్ స్లీపర్ ఒక కొత్త రకం సెమీ-హై-స్పీడ్ రైలు. భారత రైల్వేలో రాత్రిపూట ప్రయాణాలకు సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయంగా దీనిని రూపొందించారు. ప్రస్తుతం దేశంలో 50 కంటే ఎక్కువ వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి, కానీ అవి కేవలం చైర్ కార్ సౌకర్యంతో శతాబ్ది రూట్‌లలో నడుస్తున్నాయి. 

ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లు రాజధాని రూట్లలో నడిచేలా రూపొందించారు. ఇవి గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ఏసీ ఫస్ట్‌క్లాస్, ఏసీ 2 టయర్, ఏసీ 3టయర్ సహా 16 కోచ్‌లతో 1,128 మంది ప్రయాణికుల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ రైళ్లు న్యూ ఢిల్లీ-హౌరా, న్యూ ఢిల్లీ-ముంబై, న్యూ ఢిల్లీ-పూణే, న్యూ ఢిల్లీ-సికిందరాబాద్ మధ్య నడిచే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

భావ్‌నగర్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న డిజిటల్‌గా మూడు కొత్త రైళ్లను ప్రారంభించారు. వీటిలో అయోధ్య ఎక్స్‌ప్రెస్, రేవా-పూణే ఎక్స్‌ప్రెస్, జబల్‌పూర్-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. అలాగే, ఎనిమిది అమృత్ భారత్ రైళ్లను కొత్తగా ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారు.

భారత రైల్వేల పునర్మిర్మాణంపై అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వ హయాంలో భారత రైల్వేలు పెద్ద ఎత్తున ఆధునికీకరణ పొందుతున్నాయని తెలిపారు. భారత రైల్వే చరిత్రలో మొదటిసారిగా రోజుకు 12 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం రైల్వే ట్రాక్‌లు వేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు 34,000 కిలోమీటర్ల కొత్త ట్రాక్‌లు వేసినట్టు తెలిపారు. 1,300 స్టేషన్‌లను పునర్నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. 
Ashwini Vaishnaw
Vande Bharat Sleeper Train
Indian Railways
Mumbai Ahmedabad Bullet Train
Railway Modernization
Ayodhya Express
Reva Pune Express
Jabalpur Raipur Express
Amrit Bharat Trains

More Telugu News