KTR: ఆ పథకాన్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి మసే: కేటీఆర్‌

KTR Warns Revanth Reddy on Free Water Scheme in Hyderabad
  • హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి పథకానికి పాతరేయాలని చూడటం సీఎం మూర్ఖత్వానికి పరాకాష్ఠ అన్న కేటీఆర్‌
  • మహానగరంలోని కోటి 20 లక్షల మంది ప్రజలు చరిత్రలో కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్‌ను క్షమించరని వ్యాఖ్య‌
  • ఇప్పటికే హైడ్రా వంటి దిక్కుమాలిన నిర్ణయాలతో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీశారని మండిపాటు
రైతులకు సాగునీరు ఇవ్వలేని ఈ ప‌నికి మాలిన‌ సర్కారు.. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి పథకానికి కూడా పాతరేయాలని చూడటం ముఖ్యమంత్రి మూర్ఖత్వానికి పరాకాష్ఠ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. హైదరాబాద్ వాసులకు కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకాన్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి మసే అని హెచ్చ‌రించారు. మహానగరంలోని కోటి 20 లక్షల మంది ప్రజలు చరిత్రలో కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్‌ను క్షమించరన్నారు. ఇప్పటికే హైడ్రా వంటి దిక్కుమాలిన నిర్ణయాలతో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీశారని 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

"హైదరాబాద్ వాసులకు కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకాన్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి మసే..!. 20 నెలలు కావస్తున్నా.. ఇచ్చిన 420 హామీలు అమలు చేయలేక ఇప్పటికే చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి మహాపాపాన్ని మూటగట్టుకున్నారు. బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలకు కూడా ఉరివేస్తే.. మహానగరంలోని కోటి 20 లక్షల మంది ప్రజలు చరిత్రలో కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్‌ను క్షమించరు. రైతులకు సాగునీరు ఇవ్వలేని ఈ దద్దమ్మ సర్కారు, ఇప్పుడు హైదరాబాద్ లో ఉచిత తాగునీటి పథకానికి కూడా పాతరేయాలని చూడటం ముఖ్యమంత్రి మూర్ఖత్వానికి పరాకాష్ఠ.

ఇప్పటికే హైడ్రా వంటి దిక్కుమాలిన నిర్ణయాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసి తీరని నష్టాన్ని కలిగించారు. బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థానంలో రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేని రాజధాని వాసులకు మళ్లీ కరెంట్ కష్టాలను పరిచయం చేసిన పాపం రేవంత్‌దే. ఓవైపు అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ, ఇంకోవైపు వర్షాలకు దెబ్బతిన్న రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతుంటే.. ఫ్రీ వాటర్ స్కీమ్‌కు కూడా గండికొట్టాలని చూస్తున్న రేవంత్‌కు కర్రు కాల్చి పెట్టేందుకు హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు" అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.
KTR
K Taraka Rama Rao
Revanth Reddy
Telangana
Free Drinking Water Scheme
Hyderabad
BRS
Congress Party
Telangana Politics
Hyderabad Water Supply

More Telugu News