అంతరిక్షం నుంచి భారతదేశం అద్భుతంగా కనిపిస్తుంది.. మాజీ నాసా వ్యోమగామి మైక్ మాసిమినో

  • యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా పాడ్‌కాస్ట్‌లో నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోతో ఇంటర్వ్యూ
  • అంతరిక్షం నుంచి చూస్తే భారతదేశం ఆకట్టుకుంటుందని వ్యాఖ్య
  • ముంబై, ఢిల్లీ నగరాలు అద్భుతంగా కనిపిస్తాయన్న వ్యోమగామి
  • దేశాన్ని సందర్శించినప్పుడు అంతరిక్షం నుంచి చూసిన అందంతో సరిపోయిందన్న మాసిమినో
ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా తన తాజా పాడ్‌కాస్ట్‌లో నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అంతరిక్షం నుంచి భారతదేశం ఎలా కనిపిస్తుందో మాసిమినో వివరించి తన అనుభవాలను పంచుకున్నారు.

రణవీర్ అలహాబాదియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాసిమినో.. "భారతదేశం చాలా అందంగా ఉంటుంది. ప్రపంచంలోని ప్రతి భాగం ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ, భారతదేశం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది" అని చెప్పారు.

రాత్రి సమయంలో అంతరిక్షం నుంచి భూమి ఎలా కనిపిస్తుందో వివరిస్తూ "రాత్రి వేళలో భూమి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ముంబై, న్యూఢిల్లీ వంటి పెద్ద నగరాల లైట్లు స్పష్టంగా కనిపిస్తాయి" అని మాసిమినో పేర్కొన్నారు.

భారతదేశాన్ని అంతరిక్షం నుంచి చూసిన తర్వాత దానిని సందర్శించాలని తాను కోరుకునేవాడినని, చివరికి ఆ కలను నిజం చేసుకున్నానని ఆయన తెలిపారు. తాను అంతరిక్షం నుంచి చూసిన అందం, నేరుగా దేశాన్ని సందర్శించినప్పుడు అనుభవించిన అందంతో సరిపోయిందని మాసిమినో చెప్పారు.

అంతరిక్షం నుంచి ట్వీట్ చేసిన తొలి వ్యక్తిగా రికార్డ్
మైక్ మాసిమినో న్యూయార్క్‌కు చెందిన నాసా మాజీ వ్యోమగామి. కొలంబియా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, ఎంఐటీ నుంచి పీహెచ్‌డీ సహా నాలుగు డిగ్రీలు సాధించారు. మాసిమినో 1996లో వ్యోమగామిగా ఎంపికయ్యారు. 2002, 2009లో రెండుసార్లు అంతరిక్షంలోకి వెళ్లారు. మొత్తం 571 గంటల 47 నిమిషాలపాటు అంతరిక్షంలో గడిపారు. అంతరిక్షం నుంచి ట్వీట్ చేసిన మొదటి వ్యోమగామిగా మాసిమినో గుర్తింపు పొందారు. 2014లో నాసా నుంచి పదవీ విరమణ పొందారు.


More Telugu News