Chandrababu Naidu: సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Announces New Bar Policy from September 1
  • ఆదాయం కాదు, ఆరోగ్యమే ముఖ్యం: ఏపీ కొత్త బార్ పాలసీపై సీఎం చంద్రబాబు
  • ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యానికే ప్రాధాన్యం
  • పేదల కుటుంబాలు నష్టపోకుండా చూడాలన్న సీఎం
  • గీత కార్మికులకు బార్లలో 10 శాతం రిజర్వేషన్
  • లాటరీ పద్ధతి ద్వారా బార్ లైసెన్సుల కేటాయింపు
  • సెప్టెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా నాటుసారా నిర్మూలన లక్ష్యం
మద్యం పాలసీ అనగానే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ఆదాయం గురించి చూస్తాయని... కానీ మద్యం పాలసీ అంటే ఆదాయమే కాదని.. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉన్న మద్యం ద్వారా మద్యం వినియోగదారుల ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడవచ్చు అని సీఎం అన్నారు. మద్యం పాలసీ అంటే ఆదాయం మాత్రమే అని భావించొద్దని...ప్రజల ఆరోగ్యాలు ప్రధానమైన అంశమనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని మద్యం కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు నష్టపోయాయన్న విషయాన్ని సీఎం గుర్తుచేశారు. పేదల ఇల్లు, ఒళ్లు గుల్ల కాకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.

సోమవారం నాడు సీఎం చంద్రబాబు సచివాలయంలో ఆబ్కారీ శాఖపై సమీక్ష చేపట్టారు. మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం ఉన్న బార్ పాలసీ గడువు తీరడంతో.... సెప్టెంబర్ 1 నుంచి కొత్త పాలసీ రావాల్సి ఉంది. అధికారులు సీఎంకు కొత్త పాలసీపై ప్రతిపాదనలు వివరించారు. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక, ప్రతిపాదనల ఆధారంగా కొత్త పాలసీకి రూపకల్పన చేసినట్లు సీఎం తెలిపారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉన్నాయి. కొత్త పాలసీలో లాటరీ పద్దతి ద్వారా బార్లకు అనుమతులు ఇస్తారు. 50 వేల లోపు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 5 లక్షల పైన జనాభా ఉంటే రూ.75 లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు ఏడాదికి పెట్టాలనే ప్రతిపాదన మంత్రివర్గ ఉప సంఘం నుంచి వచ్చింది. కొత్త పాలసీలో అప్లికేషన్ ఫీజ్, లైసెన్స్ ఫీజు ద్వారా రూ.700 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రతి బార్ కు కనీసం 4 అప్లికేషన్లు రావాలనే నిబంధనను పెట్టనున్నారు. బార్ పాలసీలో కూడా గీత కులాలకు 10 శాతం బార్లు దక్కేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. లిక్కర్ షాపుల్లో ఎలా అయితే 10 శాతం వారికి ఇచ్చారో... అదే విధంగా బార్లలో కూడా ఆ వర్గాలకు బార్లు కేటాయించనున్నారు.

పొరుగు రాష్ట్రాల పరిధిలో సరిహద్దుల్లో లిక్కర్ సేల్స్ పెరగడానికి గల కారణాలు కూడా అధికారులు సీఎంకు వివరించారు. ఏపీలో రేట్లు తగ్గడం, అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉండడం, నాణ్యమైన మద్యం దొరకడంతో మన రాష్ట్రానికి చెందిన మద్యం వినియోగదారులు ఇక్కడే మద్యం కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. దీంతో మన దగ్గర సరిహద్దు ప్రాంతాల్లోని లిక్కర్ షాపుల్లో సేల్స్ పెరగగా.... పొరుగు రాష్ట్రాల్లో సేల్స్ తగ్గాయని అధికారులు తెలిపారు. 

గతంలో మన రాష్ట్రంలో నాణ్యమైన మద్యం లేకపోవడం, అధిక ధరలు, మంచి బ్రాండ్లు దొరక్క పోవడం వల్ల ఇక్కడి వాళ్లు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మద్యం తాగేవాళ్లని గుర్తు చేశారు. మరోవైపు దీన్ని సొమ్ము చేసుకోవడానికి అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చే వాళ్లని... ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయిందని అధికారులు చెప్పారు. అయితే ఇప్పుడు 12 జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఐడీ లిక్కర్ ఫ్రీ జిల్లాలుగా ప్రకటించామని... ఈ నెలలో మరో 8 జిల్లాలను ఇల్లిసిట్లీ డిస్టిల్డ్ లిక్కర్ ( ఐడి లిక్కర్) ఫ్రీ జిల్లాలుగా ప్రకటిస్తామని చెప్పారు. సెప్టెంబర్ నాటికి మిగిలిన 6 జిల్లాలను కూడా ఐడీ లిక్కర్ ఫ్రీ జిల్లాలుగా ప్రకటిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.
Chandrababu Naidu
Andhra Pradesh
AP Liquor Policy
New Bar Policy
Liquor Sales
Excise Department
Alcohol Consumption
Liquor Revenue
Health Policy
Illicit Liquor

More Telugu News