Chandrababu Naidu: పీపుల్, విజన్, నేచర్, టెక్నాలజీ అంశాలకు పాలనలో ప్రాధాన్యత: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Focuses on People Vision Nature and Technology in Governance
  • రాష్ట్ర స్థూల ఉత్పత్తిపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • 2029 నాటికి తలసరి ఆదాయం రూ. 5.42 లక్షలకు పెంచాలని లక్ష్యం
  • ప్రతి ప్రభుత్వ శాఖకు పనితీరును కొలిచే ఇండికేటర్లు తప్పనిసరి
  • ఉత్పత్తులకు విలువ జోడించడం ద్వారానే జీఎస్డీపీ వృద్ధి సాధ్యం
  • ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాల కల్పనే ప్రభుత్వ ధ్యేయం
పీపుల్ (ప్రజలు), విజన్ (దార్శనికత), నేచర్ (ప్రకృతి), టెక్నాలజీ (సాంకేతికత)... అనే నాలుగు అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తేనే అత్యుత్తమ ఫలితాలు సాధించగలమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు ఉండాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం సచివాలయంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ), కీలక పనితీరు సూచికలపై (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్) ప్రణాళికా శాఖ సహా పలువురు ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, "ప్రజలనే కేంద్రంగా చేసుకొని, భవిష్యత్ విజన్‌తో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. పర్యావరణానికి హాని కలగకుండా, టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటూ పాలన సాగించాలి. ఈ నాలుగు సూత్రాలను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి" అని పేర్కొన్నారు.

ఆగస్టు 15 నుంచి 700 సేవలు ఆన్‌లైన్

రానున్న ఆగస్టు 15వ తేదీ నుంచి 700 రకాల ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. పాలనలో పారదర్శకత, వేగాన్ని పెంచేందుకు టెక్నాలజీని గరిష్ఠంగా వాడుకోవాలని సూచించారు. 2029 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రూ. 5.42 లక్షలకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇది రూ. 3,47,871గా ఉండాలని స్పష్టం చేశారు.

ప్రతి శాఖకు పనితీరు ఇండికేటర్లు

ప్రతి ప్రభుత్వ విభాగం తమ పనితీరును కొలిచేందుకు నిర్దిష్ట ఇండికేటర్లను ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. నీతి ఆయోగ్ తరహాలో రాష్ట్ర ప్రణాళికా విభాగం అన్ని శాఖలను ముందుకు నడిపించాలన్నారు. "రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగితేనే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని అందించగలం. వ్యవసాయం, మైనింగ్ వంటి రంగాల్లో ఉత్పత్తులకు విలువ జోడింపుపై (వాల్యూ ఎడిషన్) దృష్టి సారించాలి" అని ఆయన సూచించారు. ప్రస్తుతం ఉద్యానవన పంటల ద్వారా రూ. 1,26,098 కోట్లు, ఆక్వా ద్వారా రూ. 1.12 లక్షల కోట్ల జీవీఏ వస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.

మనకు మనమే తెలివైన వాళ్లమని అనుకుంటే ఎలా?

"కేవలం 60 లక్షల జనాభా, పరిమితమైన వనరులతో సింగపూర్ దేశం అంతర్జాతీయంగా విజయాలు సాధిస్తోంది. భారత్ లో 140 కోట్లకు పైగా జనాభా, అపారమైన వనరులతో చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. బయటి ప్రపంచం చూడకుండా మనకు మనమే తెలివైన వాళ్లని భావించుకోవడం సరికాదు. ఆర్టీజీఎస్ ద్వారా వచ్చే సమాచారాన్ని క్రోడీకరిస్తే అది అతిపెద్ద సంపద అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ సమాచారాన్ని విశ్లేషించి వినియోగించుకుని ప్రభుత్వ శాఖల సామర్ధ్యాన్ని పెంచుకునే అవకాశముంది. అలాగే ప్రతీ త్రైమాసికానికీ సాధిస్తున్న పురోగతిపై ప్రభుత్వ శాఖలు సమీక్షించుకోవాలి” అని సీఎం చంద్రబాబు సూచించారు.

కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని వారి ఆర్థిక, ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని, ప్రభుత్వ పథకాలతో పాటు వారి ఆదాయం పెరిగేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షలో మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
GSDP
Key Performance Indicators
Online Services
State Development
Vision 2029
Poverty Reduction
Good Governance
Technology

More Telugu News