Hemant Soren: హేమంత్ సొరెన్ ను దగ్గరకు తీసుకుని ఓదార్చిన ప్రధాని మోదీ... వీడియో ఇదిగో!

PM Modi consoles Hemant Soren on Shibu Sorens death
  • ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూ సొరెన్ కన్నుమూత
  • అనారోగ్యంతో ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో తుదిశ్వాస
  • ఆసుపత్రికి వెళ్లి నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ
  • హేమంత్ సొరెన్‌ కు పరామర్శ
తండ్రి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. ఆయన్ను ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని, భుజం తట్టి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య భావోద్వేగపూరిత వాతావరణం నెలకొంది. రాజకీయాలకు అతీతంగా ప్రధాని చూపిన ఈ ఆత్మీయత అందరినీ కదిలించింది.

ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సొరెన్ సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 'గురూజీ'గా పేరుగాంచిన ఆయన మరణంతో ఝార్ఖండ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

శిబూ సొరెన్ మరణవార్త తెలియగానే ప్రధాని మోదీ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ శిబూ సొరెన్ భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం, ఆయన కుటుంబ సభ్యులను, ముఖ్యంగా కుమారుడు హేమంత్ సొరెన్‌ను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కన్నీటిపర్యంతమైన హేమంత్‌ను ప్రధాని మోదీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఓదార్చారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. శిబూ సొరెన్ మరణం తీరని లోటని అన్నారు. గిరిజన వర్గాల సంక్షేమం కోసమే శిబూ సొరెన్ తన జీవితాన్ని అంకితం చేశారని, ఆ సేవలకు ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని ప్రధాని కొనియాడారు. ఈ క్లిష్ట సమయంలో సొరెన్ కుటుంబానికి, ఆయన అనుచరులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Hemant Soren
Shibu Soren
Narendra Modi
Jharkhand
JMM
Jharkhand Mukti Morcha
Condolence
Tribal Welfare
Political News
Delhi

More Telugu News