India vs England: కామన్ సెన్స్ లేదా? అధికారుల తీరుపై దినేశ్‌ కార్తీక్, నాసిర్‌ హుస్సేన్ ఫైర్!

India vs England Test Match Controversy Dinesh Karthik and Nasir Hussain React
  • భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్టులో రాజుకున్న వివాదం
  • అధికారుల తీరుపై దినేశ్ కార్తీక్, నాసిర్ హుస్సేన్ తీవ్ర విమర్శలు
  • వర్షం ఆగాక ఆటను ఆలస్యం చేయడంపై మండిపాటు
  • ఇది కామన్ సెన్స్ లేని నిర్ణయమన్న మాజీలు
  • ఉత్కంఠభరిత దశలో మ్యాచ్‌కు బ్రేక్ పడటంతో అభిమానుల నిరాశ
భారత్, ఇంగ్లండ్ మధ్య ఉత్కంఠభరితంగా సాగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ అధికారుల తీరు కారణంగా వివాదాస్పదంగా మారింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయంలో వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలగగా, వర్షం ఆగిపోయిన తర్వాత కూడా ఆటను తిరిగి ప్రారంభించడంలో అధికారులు, గ్రౌండ్ సిబ్బంది చూపిన నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. అధికారులకు కనీస కామన్ సెన్స్ కూడా లేదంటూ మండిపడ్డారు.

ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపుకు కేవలం 35 పరుగులు అవసరం కాగా, భారత్ విజయానికి నాలుగు వికెట్లు కావాలి. ఇలాంటి కీలక తరుణంలో వర్షం పడటంతో ఆటను నిలిపివేశారు. అయితే, కొద్దిసేపటికే వర్షం పూర్తిగా ఆగిపోయి, వాతావరణం అనుకూలంగా మారినా మైదానాన్ని సిద్ధం చేయడానికి సిబ్బంది ఏమాత్రం తొందరపడలేదు. దీంతో మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన ప్రేక్షకులు, టీవీల ముందు కూర్చున్న కోట్లాది మంది అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఈ ఘటనపై స్కై స్పోర్ట్స్ కామెంట్రీ బాక్స్ లో ఉన్న నాసిర్ హుస్సేన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఈ మైదానంలో ఉన్న ప్రతిఒక్కరూ ఎంతో డబ్బు ఖర్చుపెట్టి టికెట్లు కొన్నారు. వర్షం ఆగిపోయింది. ఇక ప్రక్రియను మొదలుపెట్టండి. సూపర్-సాపర్‌ను వెంటనే బయటకు తీసుకురండి" అని ఆయన అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అధికారుల తీరు వల్ల అద్భుతమైన మ్యాచ్ రసాభాసగా మారిందని ఆయన విమర్శించారు.

మరోవైపు, దినేశ్ కార్తీక్ కూడా సోషల్ మీడియా వేదికగా అధికారుల నిర్ణయాన్ని ప్రశ్నించారు. ఇంతటి కీలకమైన మ్యాచ్‌లో, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో నిబంధనల పేరుతో మొండిగా వ్యవహరించడం సరికాదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చురుగ్గా వ్యవహరించి, ఆటను కొనసాగించేందుకు ప్రయత్నించాలని సూచించారు. వర్షం ఆగిపోయాక ఆటగాళ్ల భద్రతకు ఎలాంటి ముప్పు లేనప్పుడు, కామన్ సెన్స్ ఉపయోగించి ఆటను కొనసాగించాల్సిందని దినేశ్ కార్తీక్‌ అభిప్రాయపడ్డాడు. 
India vs England
Dinesh Karthik
5th Test
Oval
Nasir Hussain
Cricket
Rain Delay
Umpires
Ground Staff
Cricket Match

More Telugu News