అమరావతిలో కుంభమేళా మాదిరి ప్రపంచ తెలుగు మహాసభలు: గజల్ శ్రీనివాస్

  • జనవరి 3,4,5 తేదీల్లో రాజధాని అమరావతిలో నిర్వహణ   
  • మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు, 60కిపైగా దేశాల ప్రతినిధులు హాజరవుతారని వెల్లడి
  • రామోజీరావు పేరిట ఏర్పాటు చేసే ప్రాంగణంలో 25 సాహిత్య ప్రదర్శనలు ఉంటాయన్న గజల్ శ్రీనివాస్
కుంభమేళా మాదిరిగా ఏపీ రాజధాని అమరావతిలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించనున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ చైర్మన్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. వచ్చే జనవరి 3, 4, 5 తేదీల్లో ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. నిన్న తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.

మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కొన్ని రాష్ట్రాల గవర్నర్లు, పలువురు ప్రముఖులు, 60కి పైగా దేశాల ప్రతినిధులు హాజరవుతారని గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు సాహితీ ప్రక్రియలపై సదస్సులు, వెయ్యి మంది కవులతో కవి సమ్మేళనం నిర్వహిస్తామని చెప్పారు. లక్ష మంది విద్యార్థులు, యువతతో తెలుగు భాషపై సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

రామోజీరావు పేరిట ఏర్పాటు చేసే ప్రాంగణంలో 25 సాహిత్య ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రధాన వేదిక వద్ద దాశరథి, సి. నారాయణరెడ్డి పేరుతో ముఖద్వారాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానుకోట రచయితల వేదిక కన్వీనర్ గుర్రపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


More Telugu News