Yemen Boat Accident: యెమెన్ తీరంలో ఘోర విషాదం.. 68 మంది జలసమాధి

Migrant boat capsizing off Yemen leaves 68 dead 74 still missing
  • యెమెన్ తీరంలో వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా
  • ఘటనలో 68 మంది మృతి, మరో 74 మంది గల్లంతు
  • మృతులంతా ఇథియోపియా దేశస్థులుగా గుర్తింపు
  • విషయాన్ని ధ్రువీకరించిన ఐక్యరాజ్యసమితి వలసల సంస్థ 
  • ప్రాణాలతో బయటపడిన 12 మందిని కాపాడిన అధికారులు
యెమెన్ సముద్ర తీరంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మెరుగైన జీవితం కోసం పొరుగు దేశాలకు వెళ్తున్న ఇథియోపియా వలసదారులతో కూడిన పడవ బోల్తా పడింది. నిన్న తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో కనీసం 68 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 74 మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) అధికారికంగా వెల్లడించింది.

వివరాల్లోకి వెళితే.. ఇథియోపియాకు చెందిన సుమారు 154 మంది వలసదారులు ఒక పడవలో యెమెన్ మీదుగా గల్ఫ్ దేశాలకు బయలుదేరారు. యెమెన్‌లోని దక్షిణ అబ్యాన్ గవర్నరేట్ తీరానికి సమీపంలోకి రాగానే వీరి పడవ అదుపుతప్పి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం నుంచి కేవలం 12 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. స్థానిక అధికారులు వారిని రక్షించి సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలు తీరానికి కొట్టుకువస్తుండటంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.

హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతంలోని ఇథియోపియా, ఎరిట్రియా వంటి దేశాల్లో నెలకొన్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కరవు, అంతర్యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రజలు ప్రాణాలకు తెగించి సౌదీ అరేబియా వంటి సంపన్న దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు యెమెన్‌ను ఒక రవాణా మార్గంగా ఎంచుకుంటున్నారు. పదేళ్లుగా అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న యెమెన్ మీదుగా ప్రయాణం అత్యంత ప్రమాదకరమని తెలిసినా బతుకు పోరాటంలో వలసదారులు వెనక్కి తగ్గడం లేదు.

ఐఓఎం ప్రకారం, ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే, అత్యంత ప్రమాదకరమైన వలస మార్గాలలో ఒకటి. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 60,000 మంది వలసదారులు ఈ మార్గం ద్వారా యెమెన్‌కు చేరుకున్నారని ఐఓఎం గణాంకాలు చెబుతున్నాయి. ఈ తాజా ఘటనతో వలసదారుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.
Yemen Boat Accident
Yemen
Ethiopian migrants
Gulf countries
IOM
Horn of Africa
Saudi Arabia
migrant crisis
Abiyan Governorate

More Telugu News