ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏఐపై అవగాహన లేకుండా వ్యాఖలు చేయడం బాధాకరం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

  • తిరుమలలో ఏఐ టెక్నాలజీ వినియోగంపై మాజీ ఈఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు
  • సుబ్రహ్మణ్యం కామెంట్స్‌పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర స్పందన
  • ఏఐపై అవగాహన లేకుండా మాట్లాడటం బాధాకరమని పేర్కొన్న నాయుడు
  • గూగుల్, టీసీఎస్ సహకారంతో ఉచితంగానే టెక్నాలజీ అమలు చేస్తున్నామని వెల్లడి
  • రెండు గంటల్లోనే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే ప్రయత్నం
  • ఏఐని వదిలేయాలన్న సూచనను పూర్తిగా ఖండిస్తున్నట్లు స్పష్టీకరణ
శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్ఠాత్మకంగా తీసుకురానున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీపై టీటీడీ మాజీ ఈఓ, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం తన అభిప్రాయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. కేవలం కొన్ని గంటల్లోనే శ్రీవారి దర్శనం కుదరని పని అని, ఏఐ సాయంతో ఒక గంటలోనే స్వామి దర్శనం చేయించాలన్న ఆలోచనను టీటీడీ విరమించుకోవాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. 

ఈ వ్యాఖ్యలపై టీటీడీ ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. టీటీడీ ఈఓగా పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్ అధికారి ఏఐ టెక్నాలజీపై సరైన అవగాహన లేకుండా ఇలా మాట్లాడటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.

సామాన్య భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్సులో గంటల తరబడి వేచి ఉండకుండా, కేవలం రెండు గంటలలోపే శ్రీవారి దర్శనం కల్పించాలనే లక్ష్యంతో టీటీడీ పాలకమండలి ముందుకు సాగుతోందని నాయుడు వివరించారు. ఇందుకోసం గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల సహకారంతో అత్యాధునిక ఏఐ టెక్నాలజీని ఉచితంగానే వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. దాతల సహాయంతో చేస్తున్న ఈ బృహత్కార్యాన్ని వృధా అంటూ విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

ప్రస్తుతం భక్తులను గంటలు, ఒక్కోసారి రోజుల తరబడి కంపార్ట్‌మెంట్లలో, షెడ్లలో ఉంచి ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతేనా అని బీఆర్ నాయుడు ప్రశ్నించారు. భక్తుల కష్టాలను దూరం చేయాలన్న సదుద్దేశంతోనే ఏఐ టెక్నాలజీని తీసుకురావాలని నిర్ణయించామన్నారు. ప్రపంచమంతా టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నప్పుడు, టీటీడీ కూడా దానిని అందిపుచ్చుకోవడంలో ఎలాంటి తప్పులేదని ఆయన అభిప్రాయపడ్డారు.

భక్తులలో అనవసర గందరగోళం సృష్టించేలా ఏఐ టెక్నాలజీకి స్వస్తి పలకాలని సుబ్రహ్మణ్యం చేసిన సూచన ఎంతమాత్రం సరికాదని నాయుడు అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నట్లు బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.


More Telugu News