బెయిల్ పై బయటకు వచ్చి బాధితురాలిపై కాల్పులు.. ఢిల్లీలో ఘటన

  • అత్యాచారం కేసులో జైలుకు వెళ్లిన నిందితుడు
  • కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చి హత్యకు ప్లాన్
  • స్నేహితుడితో కలిసి బాధితురాలిపై కాల్పులు జరిపి పరార్
  • ఈసారి హత్యాయత్నం కేసు పెట్టిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
అత్యాచారం కేసులో జైలుపాలైన ఓ యువకుడు బెయిల్ పై బయటకు వచ్చాడు.. తనపై కేసు పెట్టిందనే కోపంతో బాధితురాలిని చంపేందుకు ప్రయత్నించాడు. స్నేహితుడితో కలిసి ప్లాన్ చేసి తుపాకీతో కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయాలతో బాధితురాలు ఆసుపత్రిలో చేరగా.. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ఈసారి హత్యాయత్నం కేసు పెట్టారు. ఢిల్లీలోని వసంత విహార్ లో చోటుచేసుకుందీ ఘోరం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో ఓ సెలూన్ హెడ్ మేనేజర్ గా పనిచేస్తున్న ఓ మహిళ తనపై అత్యాచారం చేశాడంటూ అబుజైర్ సఫీ అనే యువకుడిపై గతేడాది పోలీస్ కేసు పెట్టింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇటీవల కోర్టు బెయిల్ ఇవ్వడంతో సఫీ బయటకు వచ్చాడు. తనపై కేసు పెట్టిన మహిళను అంతమొందించేందుకు మరో స్నేహితుడు అమన్ శుక్లాతో కలిసి ప్లాన్ చేశాడు.

బుధవారం రాత్రి ఆటోలో వెళుతున్న మహిళను స్నేహితులిద్దరూ బైక్ పై వెంబడించారు. వసంత్ విహార్ ఏరియాలో మహిళపై కాల్పులు జరిపి పారిపోయారు. మహిళ ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో.. ఆటో డ్రైవర్ బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించాడు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో అబుజైర్ సఫీ, అమన్ శుక్లాను పోలీసులు అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు.


More Telugu News