Oval Test: ఓవల్ టెస్ట్‌లో భారత త్రయం జడేజా, గిల్, కేఎల్ రాహుల్ చారిత్రక రికార్డు

India Trio Scripts Historic Record During Oval Test
  • ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో పటిష్ఠ స్థితిలో టీమిండియా 
  • అద్భుత సెంచరీతో కదం తొక్కిన యశస్వి జైస్వాల్ 
  • నైట్‌వాచ్‌మన్‌ ఆకాశ్ దీప్, జడేజా, సుందర్‌ల కీలక అర్ధశతకాలు
  • ఇంగ్లండ్ ముందు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్
  • ఒకే టెస్టు సిరీస్‌లో ముగ్గురు భారత బ్యాటర్లు 500 ప‌స్ల‌ పరుగులు చేయడం ఇదే ప్రథమం
  • జడేజా, గిల్, కేఎల్ రాహుల్ అరుదైన ఘనత
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ ముందు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (118) అద్భుత శతకంతో కదం తొక్కగా, నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన ఆకాశ్ దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53) కీలక అర్ధశతకాలతో రాణించారు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా పట్టు బిగించింది.

మూడో రోజు ఆటలో భారత బ్యాటర్లు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ తన కెరీర్‌లో ఆరో టెస్టు సెంచరీని నమోదు చేశాడు. 164 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 118 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే నైట్‌వాచ్‌మన్‌గా బరిలోకి దిగిన ఆకాశ్ దీప్ తన కెరీర్‌లోనే తొలి అర్ధశతకం(66)  న‌మోదు చేశాడు. ఈ ద్వ‌యం శతక భాగస్వామ్యం భారత్‌ను పటిష్ఠ స్థితికి చేర్చింది.

ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. కీలకమైన 53 పరుగులు చేయడంతో, ఈ సిరీస్‌లో అతని మొత్తం పరుగుల సంఖ్య 516కి చేరింది. తద్వారా శుభ్‌మన్ గిల్ (754), కేఎల్ రాహుల్ (532) తర్వాత ఒకే సిరీస్‌లో 500కు పైగా పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు. కాగా, టెస్టు క్రికెట్ చరిత్రలో ముగ్గురు భారత బ్యాటర్లు ఒకే సిరీస్‌లో ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇక‌, 374 ప‌రుగుల ల‌క్ష్య‌ఛేద‌న‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య ఇంగ్లండ్‌.. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 13.5 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 50 పరుగులు చేసింది. ఆట ముగుస్తుందనగా సిరాజ్‌.. క్రాలీ (14)ని ఔట్‌ చేసి భారత్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. బెన్‌ డకెట్‌ (34 నాటౌట్‌) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్‌ విజయానికి 324 పరుగులు అవసరం కాగా భారత్‌కు 9 వికెట్లు కావాలి. 
Oval Test
Ravindra Jadeja
India vs England
Yashasvi Jaiswal
Shubman Gill
KL Rahul
Indian Cricket Team
Test Series
Cricket Records
Akash Deep

More Telugu News